శాన్‌ఫ్రాన్సిస్కో: సియాటిల్‌లో ఇటీవల ప్రవాస భారతీయుల వర్చువల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వాషింగ్టన్ గవర్నర్ జే రాబర్డ్ ఇన్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజీ విశ్వ ప్రసాద్, వారి సతీమణి వందన ప్రసాద్ నిర్వహించిన ఈ వర్చువల్ ఫండ్ రైజర్‌లో ప్రవాస భారతీయులతో గవర్నర్ సమావేశమయ్యారు. వాషింగ్టన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్మాణంతోపాటు రాష్ట్రానికి సాంస్కృతిక గుర్తింపును సుసంపన్నం చేయడంలో గవర్నర్ ఇన్సీ పాత్ర ప్రత్యేకమైనదని ప్రవాస భారతీయులు ప్రశంసించారు. దేశంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వాషింగ్టన్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రగతిశీల నాయకుడిగా గవర్నర్‌ను ప్రశంసించారు.
ఈ సమావేశంలో భారత పార్లమెంట్ ఇటీవల తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఆర్టికల్ 370ను గవర్నర్ ఇన్సీ చర్చలోకి తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కంటే తమ పరిధిలో ఉన్న కమ్యూనిటీకి సేవలందించడంపై దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికి సొంత సమస్యలున్నాయని, మన అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. అదే విధంగా 2021 సంవత్సరంలో 75 వసంతాల భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సియాటెల్‌లో భారీగా నిర్వహించబోతున్నట్లు టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. 20 వేల మందితో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు.
ఈ ఆహ్వానంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. 2021 ఆగష్టు నాటికి కోవిడ్ పరిస్థితి తగ్గిపోతుందని, ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించవచ్చని ఆయన ఆశించారు. 2012లో విశ్వప్రసాద్ అప్పటి గవర్నర్ క్రస్టిన్ గ్రెగోయర్ వాణిజ్య ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి సమన్వయపరిచారని, అలాగే 2021లో భారత దేశానికి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని విశ్వ ప్రసాద్ గవర్నర్ ఇన్‌స్టీని కోరారు. గవర్నర్ ఈ విషయంపై స్పందించి తమ సానుకూలతతను తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment