దుర్గమ్మకు బంగారు గొలుసు, సూత్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చి మ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం బంగారపు గొలుసు, మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. వై. నాగరాజు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి సుమారు రూ. 3లక్షల విలువైన 35 గ్రాముల బంగారంతో తయారు చేయించిన గొలుసు, రెండు మంగళసూత్రాలను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఇగ్నో’ కోర్సులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కోర్సులను అందిస్తోందని ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ డీఆర్ శర్మ అన్నారు. ఇగ్నో నూతనంగా అడ్మిషన్‌లు పొందుతున్న విద్యార్థులకు ఇండక్షన్ మీటింగ్ (కోర్సు పరిచయ కార్యక్రమం)ను ఆదివారం కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శర్మ మాట్లాడుతూ ఇగ్నో అందించే కోర్సులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటాయన్నారు. కేంద్రం ఉప సంచాలకుడు డాక్టర్ ప్రసాద్‌బాబు మాట్లాడుతూ ఇగ్నో ద్వారా సుమారు 300కు పైగా కోర్సులు ఉన్నాయన్నారు. కేబీఎన్ వైస్ ప్రిన్సిపాల్స్ పీఎల్ రమేష్, డాక్టర్ ఎం. వెంకటేశ్వరావు, కళాశాల ఈవో ఎన్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
14, 15 తేదీలలో యూఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహాసభలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(యూఎస్‌ఎఫ్‌ఐ) జాతీయ మహాసభలు డిసెంబర్ 14, 15 తేదీలలో రెండు రోజులపాటు విజయవాడలో జరుగుతాయని ఫెడరేషన్ జాతీయ కన్వీనర్ మాదం తిరుపతి తెలిపారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో యూఎస్‌ఎఫ్‌ఐ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది. సమా వేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యకు జీడీపీలో 10శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యూనివర్సిటీల బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాల్లో విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలన్నారు. సమావేశంలో జాతీయ నాయకులు తాడికొండ రవి, రాష్ట్ర కార్యదర్శి సందెపోగు ఉదయ్, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
సమస్యలు
పరిష్కరించాలని వినతి
మచిలీపట్నంటౌన్: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని 104 ఉద్యోగులు విన్నవించారు. 104 ఎంఎంయూ స్టేట్ కమిటీ నిర్ణయం మేరకు కృష్ణాజిల్లా కమిటీ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లి ఆదివారం ఆయనకు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి రవీంద్ర ఈ సమస్యలను ప్రభుత్వానికి తెలియపరుస్తానని హామీ ఇచ్చారు. మంత్రికి వినతి పత్రాన్ని అందజేసిన వారిలో 104 ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు అర్దం మురళీకృష్ణ, నాయకులు వినయ్, బత్తుల రవీంద్ర, గుంటూరు నాంచారయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment