బుడమేరు లీకేజీలు పరిశీలన
ఇబ్రహీంపట్నం: బుడమేరు డైవర్షన్ కాలువకు ఇటీవల వచ్చిన వరదల తాకిడికి పడిన గండ్లు వద్ద లీకేజీలను జలవనరుల శాఖ అధికారులు ఆదివారం పరిశీలించారు. ‘మాటిచ్చి.. మరిచారు’ శీర్షికతో ఈనెల 19న సాక్షి దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జలవనరుల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు బుడమేరు గండ్లు వద్ద లీకేజీ అవుతున్న ప్రాంతాలను పరిశీలించారు. పట్టిసీమ నీరు బుడమేరు కాలువ ద్వారా ప్రవహించడం వల్ల లీకేజీలు ఏర్పడినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బుడమేరు వరద ముంచెత్తి విజయవాడ నగరం ముంపునకు గురైందన్నారు. పట్టిసీమ నీరు పోలవరం కాలువ ద్వారా సుమారు ఏడు వేల క్యూసెక్కులు బుడమేరులో కలవడం వల్ల లీకేజీలు అవుతున్నాయని తెలిపారు. కృష్ణా డెల్లాకు పట్టిసీమ నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేసిన అనంతరం మరో 20 రోజుల్లో నిలుపదల చేస్తామన్నారు. ఆ తర్వాత నిపుణుల ద్వారా అవసరమైన డిజైన్‌లు సిద్ధం చేసుకుని మరమ్మతులు చేపడతామని స్పష్టం చేశారు. బుడమేరు నీటి లీకేజీలతో ప్రజలకు, పంట పొలాలకు ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆయన వెంట కృష్ణాడెల్లా చీఫ్ ఇంజినీర్ రాంబాబు, పోలవరం డైవర్షన్ చానల్ ఎస్‌ఈ శ్యామ్‌ప్రసాద్, బుడమేరు డైవర్షన్ చానల్ డీఈ అప్పిరెడ్డి, ఈఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment