విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2024
7
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
దుర్గమ్మ సేవలో డీజీపీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్ర డీజీపీ ద్వారకాతిరుమలరావు ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
వేణుగోపాలుని సన్నిధిలో..
కోడూరు: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి ఆదివారం కుటుంబ సమేతంగా హంసలదీవిలోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారిని దర్శించుకున్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న వ్యాపారవర్గాలు తమ ఆధార్ నంబర్‌ను జీఎస్‌టీ లైసెన్స్‌కు అనుసంధానం చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గడిచిన పది రోజులుగా వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఆ శాఖ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్నారు. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉన్న ఉమ్మడి కృష్ణాజిల్లాలో వ్యాపార వర్గాల పూర్తి సమాచారం వాణిజ్య పన్నుల శాఖలో లేదని ఆ శాఖ భావిస్తోంది. అందులో భాగంగా డీలర్ల నుంచి వారి ఆధార్ నంబర్‌ను వారివారి జీఎస్‌టీ లైసెన్స్‌లకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. జీఎస్‌టీ లైసెన్స్ తీసుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఆయా వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో వివరాలు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు రావటం లేదని ఆ శాఖ చెబుతోంది. అందుకే ప్రత్యేకంగా ఆధార్ అనుసంధానం చేస్తున్నట్లుగా ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకూ పది శాతమే..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మూడు డివిజన్లుగా విభజించిన ప్రభుత్వం ఆయా పన్నుల ప్రక్రియ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ఈ మూడు డివిజన్ల పరిధిలో సుమారుగా 30 వేల మంది డీలర్లు జీఎస్‌టీ లైసెన్స్‌ను కలిగి ఉన్నారు. వారిలో కేవలం పది శాతం అంటే మూడు వేల మంది మాత్రమే ఆధార్ అనుసంధానం చేశారని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 90 శాతం డీలర్ల ఆధార్ అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆయా స్థానిక అధికారులను పరుగులు తీయిస్తున్నారు.
భయపడుతున్న డీలర్లు
వ్యాపార వర్గాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆధార్ నంబర్ అనుసంధానం గురించి చెప్పగానే ఆయా వర్గాలు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నాయి. తమపై మరింత భారాలు మోపే కుట్ర ఉందేమోననే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ అధికారులు మొదటిగా ఫోన్ చేసి మీ ఆధార్ నంబర్ చెప్పండి అనగానే వ్యాపార వర్గాలు ఎవరో తమను మోసగించటానికి ప్రయత్నిస్తున్నారని భావించి అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారుల నుంచి ఫోన్‌లు వస్తున్నాయని, వాటిపై అనుమానాలు ఉన్నాయని వ్యాపారులు చెప్పటం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో ఆ శాఖ అప్రమత్తమైంది. ఆధార్ అనుసంధాన అంశంపై ఆయా డీలర్లకు మెయిల్ ద్వారా సమాచారమందించింది. అంతేకాకుండా వ్యాపార సంఘాల నేతలతో మాట్లాడి ఆధార్ అనుసంధానం చేయాల్సిందేనని, అది ఆగే అవకాశం లేదని చెప్పటంతో నాయకులు సైతం సభ్యులను అవగాహన పరిచే పనిలో పడ్డారు.
న్యూస్‌రీల్
అపోహలొద్దు..
ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం, విధాన నిర్ణయాల కోసం జీఎస్‌టీ డీలర్లు తమ ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీనిపై వ్యాపార వర్గాలకు ఎటువంటి అపోహలు, భయాందోళనలు అక్కర్లేదు. వ్యాపార సంఘాలను, ఆయా వర్గాలను అవగాహన పరిచి అనుసంధాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. వ్యాపారులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా అనుసంధానం చేసుకోవచ్చు.
– షేక్ జహీర్, డెప్యూటీ కమిషనర్,
వాణిజ్యపన్నుల శాఖ, డివిజన్–1
అవగాహన కల్పిస్తున్నాం..
వాణిజ్య పన్నుల శాఖ వ్యాపారుల లైసెన్స్‌కు సంబంధించి ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించింది. దీనిపై అధికారులతో తమ సంఘం చర్చించింది. అలాగే అధికారుల చెప్పిన దానిపై వ్యాపారులను అవగాహన పరుస్తున్నాం. దీనిపై చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం సైతం వ్యాపారులకు సహకారిగా ఉంటుంది. దీనిపై ఎవరికీ ఎటువంటి ఆందోళన వద్దు.
– వక్కలగడ్డ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి, చాంబర్ ఆఫ్ కామర్స్
వ్యాపార వర్గాలపై ఫోకస్ అందుకేనా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపార వర్గాలపై దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల విషయంలో వ్యాపారుల నుంచి పూర్తి స్థాయిలో ఆదాయం రావటం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా వ్యాపారులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పన్నుల విషయంలో మరింత పట్టు బిగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే ఈ ఆధార్ అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్‌గా ఏకే బాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రక్రియ వేగవంతం అయ్యింది.
జీఎస్‌టీ లైసెన్స్ ఉన్న డీలర్లకు
ఆధార్ లింక్ తప్పనిసరి
ఉమ్మడి జిల్లాలో
30 వేల మంది వ్యాపారులు
ఇప్పటి వరకూ లింక్ చేసింది
పది శాతమే
ఆధార్ ఇవ్వటానికి
భయపడుతున్న డీలర్లు
అపోహలొద్దంటున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment