ధ్రువీకరణ పత్రాల్లో జాప్యం వద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో నూరుశాతం జనన, మరణాల నమోదుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాలని, అత్యంత సరళీకృతంగా ధ్రువీకరణ పత్రాల జారీకి కృషిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జిల్లా విభజన అనంతరం మొదటిసారిగా జనన మరణ ఘటనల నమోదుపై అంతర శాఖల సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సంబంధించి తల్లీబిడ్డ డిశ్చార్జ్ అయ్యే సమయంలో జనన ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. మరణాల విషయంలో మృతదేహాన్ని బంధువులకు అప్పగించే సమయంలోధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన జనన, మరణ సంఘటనల విషయంలో మూడు రోజుల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రం అందజేయడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంటి వద్దే మరణిస్తే ఆ ప్రాంత పంచాయతీ కార్యదర్శి సమగ్ర విచారణ చేసి నమోదు చేయాలని, మరణ ఘటనకు సంబంధించి కర్మకాండలు ముగిసేలోపు సంబంధీకులకు ధ్రువీకరణ పత్రం అందజేయాలన్నారు. సమావేశంలో డీపీవో పి.లావణ్య కుమారి, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.సుహసిని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం గణాంక అధికారి లక్ష్మోజి తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరులోగా బీమా క్లెయిమ్‌లు పరిష్కరించండి
వరద ముంపు ప్రాంత ప్రజల వాహనాలు, వివిధ ఆస్తి నష్టాలకు సంబంధించి ఈ నెలాఖరులోగా బీమా క్లెయిమ్‌లు నూరు శాతం పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ బీమా సంస్థలకు సూచించారు. ఏ ఒక్క క్లెయిమ్ పెండింగ్ ఉండకూడదన్నారు. నగరంలో కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
బీమా సంస్థల వారీగా నమోదైన క్లెయిమ్‌లు, పరిష్కరించినవి, ఇంకా మిగిలి ఉన్న వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12,921 మోటారు వాహనాల క్లెయిమ్‌లు, 3,045 నాన్ మోటారు క్లెయిమ్‌లతో కలిపి మొత్తం 15,966 క్లెయిమ్‌లు రిజిస్టర్ అయ్యాయన్నారు. వీటికి రూ.148.58 కోట్ల చెల్లింపులతో 98.82 శాతం సెటిల్‌మెంట్ జరిగిందన్నారు. మిగిలిన ఒకశాతం క్లెయిమ్‌ల పరిష్కారంలో ఉన్న అడ్డంకులను తొలగించి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు. క్లెయిమ్‌ల పరిష్కారంలో బీమా సంస్థల కృషిని అభినందించారు. సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, ఇన్‌చార్జి ఆర్టీవో ఆర్.ప్రవీణ్, వివిధ బీమా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment