
భవానీ ద్వీపం పునరుద్ధరణ పనులు ప్రారంభం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వరద వచ్చిన దాదాపు ఏడు నెలలకు పర్యాటక శాఖకు చెందిన భవానీ ద్వీపం పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఆగస్ట్ 31న కృష్ణానదికి వరద వచ్చి దాదాపు పది అడుగులకుపైగా నీట మునిగిన భవానీ ద్వీపం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు ద్వీపానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో భవానీ ద్వీపంలో పవర్ రెస్టోరేషన్, వరద ఉధృతికి కూలిపోయిన భారీ వృక్షాలు, మేట వేసిన ఇసుక దిబ్బల తొలగింపు ప్రక్రియ కాంట్రాక్ట్‌ను టెండర్ ద్వారా దక్కించుకున్న బొర్రా క్రాంతి కుమార్ మొదలు పెట్టిన పునరుద్ధరణ పనులకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చైర్మన్ నూకసాని బాలాజీ బుధవారం కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, విజయవాడ డీవీఎమ్ కృష్ణచైతన్యతో కలిసి ద్వీపంలో పర్యటించారు. కార్యక్రమంలో భవానీ ఐలాండ్, బెరంపార్క్, బీఐటీసీ మేనేజర్లు డి.సుధీర్, కె.శ్రీనివాస్, రవీంద్ర, కాంట్రాక్టర్లు బొర్రా శ్రీకాంత్, మన్నం కొండయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎస్సీ ఉచిత శిక్షణకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం): సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహెద్‌బాబు బుధవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితాను వెబ్‌పోర్టల్‌లో ప్రదర్శించారని, ఎంపికై న అభ్యర్థులందరూ తమ ఆప్షన్ సర్వీస్ ద్వారా జ్ఞానభూమి పోర్టల్‌లో ఎం.ప్యానల్ కోచింగ్ సంస్థలకు ఈ నెల 28వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు.