నందిగామ రూరల్: నందిగామ మండల పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కై వసం చేసు కుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. దీనిలో భాగంగా రాఘవాపురం ఎంపీటీసీ సభ్యురాలు పెసరమల్లి రమాదేవిని ఎంపీపీ అభ్యర్థిగా వైస్ ఎంపీపీ ఆకుల హనుమంతరావు ప్రతిపాదించగా కేతవీరునిపాడు ఎంపీటీసీ సభ్యురాలు అరిగెల సుందరమ్మ బలపరిచారు. పెసరమల్లి రమాదేవి నామినేషన్ తప్ప కూటమి పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకపోవటంతో ఎన్నికల అధికారి, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి ఎంపీపీగా పెసరమల్లి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అనంతరం రమాదేవికి నియామకపత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. కాగా టీడీపీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యురాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన అంబారుపేట ఎంపీటీసీ సభ్యుడు ఓటింగ్‌కు హాజరు కాలేదు. ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ సురేష్‌బాబు పాల్గొన్నారు.
12 మంది ఎంపీటీసీల మద్దతు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ఎంపీపీ అభ్యర్థి పెసరమల్లి రమాదేవికి 12 మంది ఎంపీటీసీ సభ్యులు మద్దతు పలికారు. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత కూటమి పార్టీలు అధికారంలోకి రావటంతో అంబారుపేట ఎంపీటీసీ సభ్యుడు అన్నం పిచ్చయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 12కు చేరింది. ఎంపీటీసీ సభ్యులందరి ఏకాభిప్రాయంతో మండల పరిషత్ పీఠాన్ని మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు.
అభినందనలు తెలిపిన నేతలు..
మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు, శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్ నాయకులతో కలిసి మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికై న రమాదేవిని ఎంపీపీ చాంబర్‌లోని కుర్చీలో కూర్చోబెట్టి సత్కరించారు. అనంతరం జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు గాదెల వెంకటేశ్వరరావు, కేడీసీసీ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్, మాజీ ఎంపీపీ సుందరమ్మ, వైస్ ఎంపీపీ హనుమంతరావు, నెలకుదిటి శివనాగేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు రమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు.
ఏకగ్రీవంగా ఎన్నికై న రమాదేవి మద్దతు పలికిన 12 మంది సభ్యులు
సముచిత స్థానం దక్కింది..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనను ఎంపీపీగా గెలిపించి సముచిత స్థానం కల్పించిందని రమాదేవి పేర్కొన్నారు. తన విజయానికి సహకరించిన మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు, శాసనమండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి విధేయతగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పారు.
మండల పరిషత్ పీఠం వైఎస్సార్ సీపీదే