ఎమ్మెల్సీగా గెలిచిన అనంతరం సర్టిఫికెట్‌ను తీసుకుంటున్న నర్తు రామారావు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికలు మారాయి. ఫలితం మారలేదు. అభ్యర్థులే మారారు.. పార్టీ ఆధిక్యత మారలేదు. సార్వత్రిక ఎన్నికల్లో మొదలైన వైఎస్సార్ సీపీ విజయ విహారం.. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కొనసాగింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీనే విజయ పతాకం ఎగురవేసింది. జిల్లాలో టీడీపీ కుట్రలు ఫలించలేదు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆనెపు రామకృష్ణకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మద్దతు పలికినా లాభం లేదు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపును ఆపలేకపోయారు. 524 ఓట్ల మెజార్టీతో నర్తు విజయకేతనం ఎగరవేశారు. కౌంటింగ్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఫలితం వచ్చేసింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన టీడీపీ నాయకుడికి ఓటమి తప్పలేదు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తిరుగులేని విజయం సాధించింది. పోలైన 752 ఓట్లలో 632 ఓట్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్తు రామారావుకు పడగా, ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన టీడీపీ నాయకుడు రామకృష్ణకు 108 ఓట్లు మాత్రమే దక్కాయి. అద్భుతం చేస్తామని టీడీపీ నాయకులు చెప్పినా వారి ఆశలు ఫలించలేదు. ఎవరి ఓట్లపైనా ఆశపడకుండా తమ ఓట్లుతోనే వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. సామాజిక కోణంలో చిచ్చు రేపి లబ్ధిపొందాలని ఆశించిన టీడీపీ నాయకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఆత్మప్రబోధం మేరకు ఓటు వేయాలని ఇండిపెండెంట్ అభ్యర్థి కోరినట్టుగానే వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులంతా తమ పార్టీ అభ్యర్థికి ఓటేసి అఖండ విజయం చేకూర్చారు. టీడీపీ నాయకుల ప్రలోభాలు, కుట్రలు, సామాజిక వర్గం కోణంలో వైఎస్సార్‌సీపీ ఓట్లు కొల్లగొట్టేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు.
కౌంటింగ్ ఆసక్తికరం..
మొత్తం పోలైన 752 ఓట్లు లెక్కించగా 12ఓట్లు ఇన్‌వాలిడ్ అయ్యాయి. ఒకటి అంకె రాయడానికికి బదులు టిక్ పెట్టడంతో ఆ ఓట్లు చెల్లలేదు. ఇవన్నీ వైఎస్సార్‌సీపీకి చెందిన సభ్యులవే కావ డం విశేషం. దీంతో వైఎస్సార్‌సీపీకి 632 ఓట్లు మాత్రమే కౌంట్ అయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థికి 108ఓట్లునమోదయ్యాయి. దీంతో 524 ఓట్ల ఆధిక్యతతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం ఖాయం చేసుకున్నారు.
ఎట్టకేలకు నర్తు కల సాకారం..
చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలని నర్తు రామారావు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ నెరవేరలేదు. గతంలో రెండు సార్లు అసెంబ్లీకి పోటీ చేసినా విజయం వరించలేదు. 2009 ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి కాంగ్రెస్ తరఫున, 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఓట మి పాలయ్యారు. దీంతో చట్ట సభలకు వెళ్లాల న్న కోరిక కలగానే మిగిలిపోయింది. 2019 ఎన్ని కల సమయంలో ఈసారి ఎమ్మెల్సీ చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇవ్వడంతో ఆయనకు ఆశలు చిగురించాయి. మాట ఇస్తే మడమ తప్పరు అని నిరూపించుకున్న వైఎస్ జగన్ నిర్ణయంతో చట్టసభలకు వెళ్లాలన్న కోరిక సాకారమైంది.
తొలి యాదవ నేత
జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత తొలిసారి చట్టసభలో అడుగు పెడుతున్నా రు. జిల్లా చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్క యాదవ నేత చట్టసభలకు వెళ్లలేదు. నర్తు రామారావుకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేయడమే కాకుండా అత్యధిక మెజార్టీతో గెలిచిన నాయకుడిగా నర్తు రామారావు చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పటివరకు ఇంత మెజార్టీ వచ్చిన సందర్భం లేదు.
సీఎంకు జీవితాంతం
రుణపడి ఉంటా
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): స్వాతంత్య్రం అనంతరం యాదవులకు రాజకీయాల్లో అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. తమకు ఇంత గుర్తింపు ఇచ్చిన సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడించాక ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభిమానులు, యాదవుల సమక్షంలో భారీగా బాణసంచా కాల్చి సంబరాలను జరుపుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకు ళం వరకు కార్లతో ర్యాలీగా కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు విజ యోత్సవాన్ని జరుపుకొన్నారు. అనంతరం నర్తు మాట్లాడారు. టీడీపీ యాదవుల్ని ఓట్లు, సీట్లు కోసం వాడుకుందే తప్ప ఏనాడూ ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. జిల్లాలో ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలంతా సహకరించి నా మీదు న్న అభిమానాన్ని చూపించినందుకు రుణపడి ఉంటానన్నారు. అంతేకాకుండా తన గెలుపునకు కృషి చేసిన రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయోత్సవాల్లో పిరియా సాయిరాజ్, నర్తు నరేంద్రయాదవ్, పిన్నింటి సాయి, ఇప్పిలి కృష్ణారావు, తడక జోగారావు, పిలక రాజ్యలక్ష్మి, సంతోష్, ఆదిరెడ్డి, రజనీకుమార్ డొలాయ్, కడియాల ప్రకాష్, బద్రి ప్రకాష్, గద్దిబోయిన కృష్ణాయాదవ్, మామిడి సంతోష్ పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్తు రామారావు గెలుపు
కనీస పోటీ ఇవ్వలేకపోయిన
ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన
టీడీపీ నాయకుడు
చంద్రబాబు జోక్యం చేసుకున్నా ఫలితమివ్వని పరిస్థితి
524 ఓట్ల మెజార్టీతో గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
– స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
నర్తు రామారావు
Comments
Please login to add a commentAdd a comment