
సేవా పేపరుమిల్లు గేటు నీడలో విశ్రాంతి తీసుకుంటున్న ధనుర్జయ బాఘ్, అతని భార్య
జయపురం: సబ్ డివిజన్ పరిధిలోని గగనాపూర్‌లో ఉన్న సేవా పేపర్‌మిల్లు యాజమాన్యాలు మారినా.. శ్రామికుల బాధలు కన్నీటి గాథలుగానే ఉన్నాయి. బిల్డ్ కంపెనీ నుంచి మిల్లును హస్తగతం చేసుకున్న మదర్ అర్థరిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కూడా విశ్రాంత శ్రామికల కష్టాలను లెక్కచేయడం లేదు. వారికి చెల్లించాల్సిన పింఛన్, గ్రాడ్యుటీ, పీఎఫ్ బకాయిలు ఇప్పటికీ చెల్లించడం లేదు. కార్మిక సంఘం ఎన్ని వినతులు చేసినా, నెలలు తరబడి ఆందోళన చేపట్టినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దీంతో విశ్రాంత శ్రామికులు సరైన వైద్యం సైతం పొందలేక ఇప్పటికే 30మందికి పైగా మృతి చెందినట్లు కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో మరో శ్రామికుడు ధనుర్జయ భాగ్ తన భార్యతో సహా ఆదివారం ఉదయం మండుటెండలో మిల్లు ప్రధాన గేటు వద్ద ధర్నాకు దిగారు. తనకు రావాల్సిన పింఛన్, గ్రాడ్యుటీ బకాయిలను చెల్లించాలని యాజమాన్యాన్ని కోరినా మనసు కరగలేదని వాపోయారు. 2011లో ఉద్యోగ విరమణ చేశానని, అప్పటి నుంచి ఇదే పరిస్థితని వివరించారు. అప్పులు చేసి అతి కష్టంతో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నానని, ఇక గత్యంతర లేక నిరసనకు దిగినట్లు చెప్పుకొచ్చారు.
ఈనెల 21న నిరవధిక ధర్నా
ఈ సందర్భంగా విశ్రాంత శ్రామిక సంఘ కన్వీనర్, ప్రముఖ కార్మికనేత ప్రమోద్‌కుమార్ మహంతి మీడియాతో మాట్లాడారు. వెంటనే మిల్లు యాజమాన్యం స్పందించకపోతే ఈనెల 21 నుంచి జయపురం లోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట నిరవధిక ధర్నా చేపడతామని ప్రకటించారు. విశ్రాంత శ్రామికుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు యాజమాన్యానికి, అధికారులకు చెబుతున్నా.. బకాయిలు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికై నా స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

మిల్లు మేనేజర్ నివాసం ముందు ధర్నా చేస్తున్న ప్రమోద్ మహంతి
Comments
Please login to add a commentAdd a comment