అబుల్ కలామ్ ఆజాద్‌కు ఘననివాళి
నరసరావుపేట: స్వాతంత్య్ర సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 137వ జయంతి వేడుకలను సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. మౌలానా చిత్రపటం వద్ద కలెక్టర్ పి.అరుణ్‌బాబుతోపాటు పలువురు జిల్లా అధికారులు ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మైనార్టీశాఖ, ఇతర జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పెళ్లి కుమారుడైన
పాండురంగస్వామి
అమరావతి: ప్రఖ్యాత శైవక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీరుక్మాభాయి సమేత పాండురంగస్వామి దేవాలయంలో పాంచాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారిని పెండ్లికుమారుని చేసి అర్చకులు ధ్వజారోహణ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు పరాశరం రామకృష్ణమాచార్యులు ఉత్సవాల గురించి వివరించారు. మంగళవారం చిన్న శేషవాహనం, బుధవారం ఉదయం దధిమధనోత్సవం, గోపాల బాలోత్సవం, గురువారం అశ్వవాహనంపై కల్యాణమూర్తులకు ఎదుర్కోలు మహోత్సవం అనంతరం రుక్మాభాయికి పాండురంగస్వామికి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. శుక్రవారం కార్తిక పౌర్ణమి రోజున స్వామివారికి లక్ష తులసీపూజ నిర్వహిస్తామన్నారు. శనివారం వసంతోత్సవం, చూర్ణోత్సవం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శివయ్య సేవలో
వేణుగోపాలరెడ్డి దంపతులు
పెదకాకాని: భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిశు సంక్షేమశాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి వేణుగోపాలరెడ్డి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో ఉప కమిషనర్ కేబీ శ్రీనివాస్, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం వేణుగోపాలరెడ్డి దంపతులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని స్వామి శేషవస్త్రంతో సత్కరించి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఉప కమిషనర్ శ్రీనివాస్ స్వామి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.
నేడు సుంకం వసూలు హక్కులపై బహిరంగ వేలం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ ఆధీనంలోని రేవుల్లో సుంకం వసూలు చేసుకునే హక్కులపై మంగళవారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. అచ్చంపేట, మాచవరం, అమరావతి, కొల్లిపర మండలాల్లోని కృష్ణానదీ పరివాహక రేవుల్లో గెజిట్ నిబంధనల మేరకు ఈనెల 12 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాలానికి సుంకం వసూలు హక్కులపై ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు సీల్డ్ టెండర్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను జెడ్పీ కార్యాలయం నుంచి పొందాలని తెలిపారు.
గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులు
గుంటూరు ఎడ్యుకేషన్: వావిలాల గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయశాస్త్ర సర్టిఫికెట్ కోర్సుకు (సీఎల్‌ఐఎస్సీ) దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ ప్రిన్సిపాల్ దోనె రాంబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తి చేసి, 18 ఏళ్ల వయసు నిండిన అభ్యర్థులు కోర్సులో చేరేందుకు అర్హులని, ఐదు నెలల కాల వ్యవధిలో తెలుగు. ఆంగ్ల మాధ్యమాల్లో బోధన ఉంటుందని తెలిపారు. 93962 38946 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment