భక్తజన సంద్రం.. అమరారామం
అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రం అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయం కార్తిక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన పంచారామక్షేత్ర సందర్శన భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కృష్ణాజలాలలో కార్తిక స్నానాలు చేసి, ఆలయంలోని ఉసిరిక చెట్టు వద్ద కార్తిక దీపారాధనలు చేశారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం సుమారు 70 పైగా బస్సులలో పంచారామ క్షేత్రసందర్శన యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ కార్తిక సోమవారం విశిష్టతను వివరించారు. ఆలయ ఈఓ సునీల్‌కుమార్ అన్నదానం, ఉచిత ప్రసాదం ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామవారిని సుమారు 12వేల మంది భక్తులు దర్శించుకున్నారని దేవాలయ అధికారుల అంచనా. సీఐ ఎం.శ్రీనివాసరావు తన సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
అఘోరీ హల్‌చల్..
మధ్యాహ్నం 12 గంటల సమయంలో అఘోరీ సన్యాసిని అమరేశ్వరా స్నానఘాట్ వద్ద హల్‌చల్ చేసింది. తనకు స్వామివారి దర్శనం కల్పించాలని లేకుంటే కారును కృష్ణానదిలోకి దూకిస్తానని బెదిరించింది. ఈనేపధ్యంలో సీఐ ఎం.శ్రీనివాసరావు తమ సిబ్బందితో వచ్చి అఘోరీ సన్యాసినిని దేవాలయంలోకి తీసుకెళ్లి స్వామివారి, అమ్మవారి దర్శనం కల్పించటంతో పాటు ఎస్కార్ట్‌తో అమరావతి నుంచి సాగనంపారు.
Comments
Please login to add a commentAdd a comment