ఆశ్రమ పాఠశాలల్లో... మృత్యు ఘంటికలు!
● వివిధ ఆరోగ్య సమస్యలతో తనువుచాలిస్తున్న ఆశ్రమ విద్యాకుసుమాలు ● ఈ ఏడాదిలో ఏడుగురి మృతి ● శిశు, గిరిజన సంక్షేమ శాఖలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి సంధ్యారాణి ఇలాకాలోనే విద్యార్థి మరణాలు ● ఆవేదనలో విద్యార్థి వర్గాలు
గిరిజన విద్యార్థుల మరణాలపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): గిరిజన విద్యార్థుల మరణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు కొల్లి గంగునాయుడు బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు ఏడుగురు గిరిజన విద్యార్థులు మృతిచెందారని, ఈ మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియజేయాలన్నారు. విద్యార్థుల అస్వస్థత, వ్యాధుల వ్యాప్తికి కలుషిత తాగునీరే కారణమని వైద్యులు చెబుతున్నా స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మరమ్మతులకు గురైన వాటర్‌ప్లాంట్లు వినియోగంలోకి తేవాలన్నారు. ఇప్పటివరకు చనిపోయిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఇకమీదట విద్యార్థుల మరణాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఆశ్రమ పాఠశాలల్లో మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. సీజనల్ వ్యాధులు, జ్వరాలు, వివిధ ఆరోగ్య సమస్యలతో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ.. పిల్లల మరణాలు ఆగడం లేదు. ఈ ఏడాది కాలంలోనే ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. ఫలితంగా తమ బిడ్డల్లోనే భవిష్యత్తును చూసుకుంటున్న తల్లిదండ్రులకు కడుపుశోకం మిగులుతోంది.
మంత్రిగారూ.. కాస్త దయ చూపరూ!
జిల్లాలోని సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గుమ్మిడి సంధ్యారాణి.. రాష్ట్ర మహిళాశిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగా బాధ్యత లు చేపట్టగానే మొదటి సంతకం ఆశ్రమ పాఠశాల ల్లో ఏఎన్‌ఎంల నియామకంపైనే ఆమె చేశారు. ఇప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. ఆశ్రమ పాఠశాలల చిన్నారులు ఒక్కొక్కరుగా ప్రాణాలు వదులుతున్నా.. వాటిపై పర్యవేక్షణ పెంచడం, సమస్యలను పరిష్కరించడం వంటి చర్యలు కానరావడం లేదు. కొద్ది నెలలుగా జిల్లాలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు విజృంభిస్తున్నాయి. నివారణకు పక్కా ప్రణాళిక లోపిస్తోందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు మరణిస్తున్నా మంత్రిలో చలనం కనిపించడంలేదని విమర్శిస్తున్నాయి.
పాపం.. చిన్నారులు
ఈ ఏడాది జులై 6న జియ్యమ్మవలస మండలానికి చెందిన రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బి.ఈశ్వరరావు మృతి చెందాడు. అదే నెల 22న పార్వతీపురం మండలంలోని రావికోన ఆశ్రమ పాఠశాలకు చెందిన పి.రాఘవ అనే ఆరో తరగతి విద్యార్థి సెరిబ్రల్ మలేరియాతో కన్ను మూశాడు. గుమ్మలక్ష్మీపురం మండలం వంగరకు చెందిన నాలుగో తరగతి విద్యార్థి ఎం.గౌతమ్ మలేరియాతో ప్రాణాలు వదిలాడు. కొమరాడ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కడ్రక శారద, గుమ్మలక్ష్మీపు రం మండలం పి.ఆమిటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతు న్న నిమ్మల అవంతి డెంగీతో ప్రాణాలు వదిలారు. తాజాగా మంగళవారం కురుపాంలో ఓ విద్యార్థి మరణించగా.. బుధవారం జియ్యమ్మవలస మండ లం రావాడ రామభద్రపురం గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఏడో తరగతి విద్యార్థి నిమ్మక జీవన్ కన్నుమూశాడు. ఇవి కేవలం ఆశ్రమ పాఠశాలల్లో వెలు గు చూసిన ఘటనలే. వీటి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. నిత్యం జిల్లాలో గిరిజన విద్యార్థులు మరణిస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఆ తల్లిదండ్రులకు కడుపుకోత తప్పడం లేదు. కేవలం విద్యార్థులే కాదు.. జ్వరాలు, సీజనల్ వ్యాధులు పెద్దవారినీ కబళించేసిన ఉదంతాలు ఈ ఏడాది అనేకం.
పర్యవేక్షణ కరవు
జిల్లాలో 55 వరకు ఆశ్రమ పాఠశాలలున్నాయి. రెండు ఐటీడీఏలకు పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండకపోవడం వల్ల పర్యవేక్షణ కొరవడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఐటీడీఏలకు రెగ్యులర్ పీవోలు ఉండడం లేదు. అధికారుల కొరత.. సరిపడా నిధులు మంజూరు కాకపోవడం.. వెరసి పాఠశాలలపై పర్యవేక్షణను గాలికి వదిలేశారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా ఉంటున్నాయి. చిన్నపాటి జ్వరం వచ్చినా మందులు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మన్యంలో జరుగుతున్న గిరిజన విద్యార్థుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి బాధ్యత వహించాలి. ఈ విద్యాసంవత్సరంలోనే ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులు మృతి చెందడం బాధాకరం. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎటువంటి నివారణ చర్యలూ చేపట్టలేదు. మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి.
– పాలక రంజిత్‌కుమార్, ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ సంఘం
చిన్నారిని కాటేసిన జ్వరం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలురు)లో నాలుగవ తరగతి చదువుతున్న నిమ్మక నితిన్(9) అనారోగ్యంతో బుధవారం మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన నితిన్ పాఠశాలకు రాకపోవడంతో రెండురోజుల క్రితం ఆశ్రమ పాఠశాల సిబ్బంది నితిన్ స్వగ్రామం గుమ్మలక్ష్మీపురం మండలంలోని గుజ్జలగండ వెళ్లగా అప్పటికే నితిన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యుల సాయంతో చిన్నారిని సమీపంలోని దుడ్డుఖల్లు పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం అందించారు. అప్పటికీ నయం కాకపోవడంతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు, ఆశ్రమ పాఠశాల సిబ్బంది తెలిపారు.
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
జియ్యమ్మవలస: మండలంలోని రావాడ రామభద్రపురం గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న నిమ్మక జీవన్‌కుమార్ (12) బుధవారం ఉదయం మృతిచెందాడు. మంగళవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయాడని, బుధవారం ఉదయం తెల్లవారు జామున కళ్లు తిరుగుతున్నట్టు తెలిపాడని, దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లేసరికి మృతిచెందినట్టు పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. మృతునిది గుమ్మలక్ష్మీపురం మండలం ఒండిడి గ్రామం. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదువుకునేందుకు వెళ్లిన జీవన్ శవమై రావడంతో గ్రామంలో విషాదం అలముకుంది.
Comments
Please login to add a commentAdd a comment