యువత సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయవద్దు
విజయనగరం పూల్‌బాగ్: కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో పదవీ విరమణ చేసిన సిబ్బందిని మళ్లీ నియమించాలని భారతీయ రైల్వే ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయనగరం రైల్వే స్టేషన్‌మాస్టర్. మాస్టర్ మురళికి డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వినింగ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ సీహెచ్. హరీష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఈ విధానం యువత సామర్థ్యాన్ని బలహీనపరిచే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే దేశంలో ఇప్పటికే నిరుద్యోగం తారాస్థాయిలో పెరుగుతున్న తరుణంలో రైల్వే శాఖలో 2.98 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, అర్హత కలిగిన నిరుద్యోగులను పక్కన పెట్టి కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిటైర్డ్ ఎంప్లాయీస్‌ను తీసుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోడీ అందుకు భిన్నంగా యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించడం దుర్మార్గమంటూ ఖండించారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 9.8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ సభ్యులు దుర్గాప్రసాద్, కిరణ్ పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment