జీసీసీ గొడౌన్‌లో అగ్నిప్రమాదం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామంలోని జీసీసీ అటవీఫలసాయాల కొనుగోలు కేంద్రం (ఎంఎఫ్‌పీ)లో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గొడౌన్‌లో నిల్వ ఉంచిన నరమామిడి చెక్కల బస్తాలు దగ్ధమయ్యాయి. గొడౌన్ లోపలి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు తలుపులు తెరిపించి చూసేలోగా నరమామిడి చెక్కల బస్తాలు అగ్నికి ఆహుతుండడం గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అలాగే గుమ్మలక్ష్మీపురం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. అయినప్పటికీ కొంతమేర బస్తాలు కాలిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న పార్వతీపురం జీసీసీ డివిజనల్ మేనేజర్ వి.మహేంద్రకుమార్ హుటాహుటిన మొండెంఖల్లు చేరుకుని గొడౌన్‌ను పరిశీలించి, జరిగిన నష్టం, అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. గొడౌన్ వద్ద 2,400 నరమామిడి చెక్కల బస్తాలు నిల్వ ఉండేవని, జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.15 లక్షలు విలువ చేసే నరమామిడి చెక్కలు కాలిబూడిదయ్యాయని డీఎం తెలిపారు. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఆయన వెంట గుమ్మలక్ష్మీపురం జీసీఎంఎస్ మేనేజర్ కృష్ణప్రసాదరావు, ఎంఎల్‌ఎస్ స్టాక్ పాయింట్ సూపరింటెండెంట్ ఎం.సాంబశివరావు తదితరులు ఉన్నారు.
బూడిదైన నరమామిడి చెక్కల బస్తాలు
Comments
Please login to add a commentAdd a comment