పెద్దనాన్న దగ్గరుంటే బతికేది.. | - | Sakshi
Sakshi News home page

పెద్దనాన్న దగ్గరుంటే బతికేది..

Published Fri, May 12 2023 2:04 AM | Last Updated on Fri, May 12 2023 4:40 PM

- - Sakshi

(రజిత ఫైల్‌ ఫోటో)

మంథని: పట్టుమని పదేళ్లు కూడా లేవు. ఆడుతూ పాడాల్సిన వయసులో తల్లిప్రేమకు దూరమైనా.. తండ్రి, అన్నకు ఇంటి సపర్యలు చేస్తూ వచ్చింది. గ్రామంలోని అందరినీ తనవాళ్లే అనుకుంటూ.. వరుసపెట్టి పిలిచే చిన్నారి ఇక లేదంటూ భట్టుపల్లి ఘోల్లుమంది. మద్యానికి బానిసై సైకోగా మారిన తండ్రి గొడ్డలివేటుకు కానరాని లోకాలకు వెళ్లిపోయిన రజితను తలుచుకుంటూ గ్రామస్తులు కన్నీరు పెడుతున్నారు. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని ఆరుగంటల పాటు ఆందోళనకు దిగారు.

తల్లిమరణంతో పెద్దనాన్న చెంతకు..
మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదానందం మద్యానికి బానిసై సైకోగా మారి ఏ పని లేకుండా తిరుగుతున్నాడు. భార్య శ్రీలత కూలీనాలి చేసి కొడుకు అంజి, కూతురు రజిత(10)ను పోషించుకుంటూ వచ్చింది. సదానందం ఆగడాలు మితిమీరిపోవడంతో తట్టుకోలేక ఎనిమిది నెలల క్రితం ఉరివేసుకుని శ్రీలత తనవు చాలింది. అంజి గ్రామంలో దొరికిన పని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో రజితను ఆమె పెద్దనాన్న సాదుకుంటానని తీసుకెళ్లాడు. కొద్దిరోజుల పాటు అతని దగ్గరే ఉంది. ఇటీవలే తండ్రి దగ్గరకు వచ్చింది. పెద్దనాన్న ఇంట్లో ఉంటే రజిత ప్రాణాలు దక్కేవని గ్రామస్తులు చెబు తున్నారు. తల్లి మరణం తర్వాత కూతురు రజిత ఇంటి పనులు చక్కగా చేసేదని, పనులు ముగించుకొని బడికి వెళ్లేదని, చదువులో చురుగ్గా ఉండే రజిత ఐదోతరగతి చదువుతోందని, పదేళ్లకే నూరేళ్లు నిండాయని గుర్తు చేసుకున్నారు.

మద్యం ఇవ్వనందుకే దాడి
గురువారం ఉదయం మద్యం మత్తులో సదానందం ఇంటికి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. కూతురు రజితను గొడ్డలితో నరికి చంపాడు. అదే గొడ్డలితో గ్రామంలోని దూపం శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లాడు. బెల్ట్‌దుకాణం నిర్వహించే శ్రీనివాస్‌ను మద్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఆయన నిరాకరించడంతో గొడ్డలితో దాడి చేశాడు. తప్పించుకునే క్రమంలో ముక్కు, కన్ను పక్క భాగం, నొసలుపై గొడ్డలివేటు పడింది. కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌కు 15కుట్లు పడ్డాయి.

ఊరంతా ఒక్కటై..
సదానందం గతంలోనూ గ్రామానికి చెందిన రెడ్డి రాజేశం అనే వ్యక్తితో పాటు చాలామందిపై దాడి చేశాడు. ఈ క్రమంలో కన్న కూతురునే చంపిన సదానందంను తమ కళ్లముందే ఉరితీయాలని గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. పోలీసులకు ఎదురు తిరిగారు. పలువురిపై దాడికి సైతం దిగారు.

మా కళ్ల ముందే చంపాలే
ఊళ్లే ఎంతో మంది మీద దాడి చేసిండు. ఎందరో ఆడోళ్ల మీద అఘాయిత్యం చేయబోయిండు. గిప్పు డు కన్న కూతురును చంపిండు. అట్లాంటోడు బతికిఉండొద్దు. మా కళ్ల ముందే ఎన్‌కౌంటర్‌ చేయాలే. లేకుంటే మాకు వదిలిపెట్టాలే.
– ఊటుకూరి సరోజన, భట్టుపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement