సాక్షి, పెద్దపల్లి: జనాభా దమాషాపరంగా సమాజంలో సగానికి పైగా ఉన్నా.. ఇన్నాళ్లు రాజకీయంగా న్యాయం జరగలేదని, అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువకులు.. ఆర్థికంగా బలపడిన నాయకుల్లో తమ సామాజిక వర్గం బీసీలకు సమ ప్రాధాన్యం దక్కాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బీసీ ఓటర్లు గణనీయంగా ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు బీసీ నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు.
‘బీసీ ఎమ్మెల్యే’ అంటూ బీసీవాదం నియోజకవర్గంలో బలపడుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు బీసీలే ఉన్నప్పటికీ.. సరైన రాజకీయ ప్రాధాన్యం దక్కడంలేదన్న అసంతృప్తివ వారిలో ఉంది. దీంతో ఈసారైనా బీసీ ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు పార్టీలకతీతంగా నాయకులు సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఆయా పార్టీల నుంచి బీసీలకు టికెట్ ఇస్తే గెలిపిస్తామని, కాదనే పార్టీల అభ్యర్థులను ఓడించి తీరుతామని తేల్చి చెబుతున్నారు.
ఏడుసార్లు టికెట్.. ఇద్దరు గెలుపు
1952 నుంచి పెద్దపల్లి శాసనసభకు ఇప్పటివరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. ఇందులో ఏడు సార్లు బీసీ అభ్యర్థులకు టికెట్ లభించింది. అయితే ఇద్దరు మాత్రమే ముత్తయ్య, బిరుదు రాజమల్లు బీసీ అభ్యర్థులుగా విజయం సాధించారు. ఒకసారి ఎస్సీ, మిగిలిన సారు్‌ల్ రెడ్డి, వెలమ సామాజికవర్గానికి చెందిన వారే ఎన్నికయ్యారు. స్థానికంగా బీసీ ఓటర్లు కీలకంగా ఉన్నప్పటికీ రెండు సామాజిక వర్గాల నాయకులే ఎన్నికవ్వడంపై బీసీ నాయకులు గుర్రుగా ఉన్నారు. పార్టీలకతీతంగా బీసీ ఎమ్మెల్యేను గెలిపించుకునేందుకు ఏకమవుతున్నారు.
ప్రతిపక్ష పార్టీల్లోనూ బీసీల దూకుడు
అన్ని పార్టీలతో పోల్చి చూస్తే బీఎస్పీ నుంచి దాసరి ఉష అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇంటింటికీ దాసరి ఉష కార్యక్రమంతో ప్రజలతో మమేకమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి గంట రాములు బీసీ కోటాలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఇంటింటికీ విజ్జన్న పేరుతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
గతంలో రేవంత్‌రెడ్డి పెద్దపల్లికి వచ్చిన సందర్భంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయరమణారావును ప్రకటించారు. ఇటీవల జిల్లానుంచి సాగిన భట్టి విక్రమార్క పాదయాత్రను విజయవంతం చేసి తన ప్రజాబలాన్ని నిరూపించుకున్నారు విజయ్. ఈనేపథ్యంలో రేవంత్‌తోపాటు భట్టి సైతం విజయరమణారావుకు టికెట్‌పై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమచారం. అయితే గంట రాములు ఉదయ్‌పూర్ డిక్లరేషన్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో ప్రతి లోక్‌సభ పరిధిలో ఇద్దరు బీసీలకు టికెట్ ఇస్తారని, ఆ కోటాలో టికెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి ఏగోలపు సదయ్యగౌడ్ బీసీ నినాదంతో ముందుకుసాగుతున్నారు.
బీఆర్‌ఎస్ టికెట్ రేసులో ‘బొద్దుల’
రాష్ట్రంలో 12 శాతానికి పైగా ఉన్న పద్మశాలీల సామాజికవర్గం నుంచి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఎల్.రమణ మినహా మరెవరికీ ప్రాతినిధ్యం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి పద్మశాలీలకు రెండు నుంచి మూడు టికెట్లు ఇవ్వాలని పద్మశాలీసంఘం నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లిలో సుమారు 30 వేలకుపైగా పద్మశాలీ ఓట్లు ఉన్నాయని, తనకు టికెట్ కేటాయిస్తే గెలుపు తథ్యమని బీఆర్‌ఎస్ తరఫున జిల్లాలోని జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ కోరుతున్నారు. బీసీ కోటాలో బరిలో నిలిచేందుకు ఆయన ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసీఆర్ సేవాదళం పేరిట తన కార్యకలాపాలు కొనసాగిస్తూ గ్రామీణప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహిస్తూ పార్టీలైన్ దాటకుండానే ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వేల్లో సైతం తనకు మద్దతు లభిస్తోందని, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ముఖ్యనేతలను కలుస్తూ మార్పు అనివార్యమైనప్పుడు సహకారం అందించాలని కోరుతున్నారు. విద్యార్థి ఉద్యమ నా యకుడు, కేటీఆర్ సన్నిహితుడైన టీఎస్‌టీఎస్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేష్ సైతం టికెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్‌కే టికెట్ అంటూ ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు కార్యకర్తలు, ప్ర జలతో మమేకమవుతూ సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment