● గతేడాది ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుకు రూ.647 కోట్లు ● కొత్తపల్లి–మనోహరాబాద్ లైన్ ఈ ఏడాది పూర్తి అయ్యేనా? ● రామగుండం–మణుగూరు లైన్ నిధులపై ఉత్కంఠ ● హసన్ పర్తి–కరీంనగర్ లైన్ కేటాయింపులు జరిగేనా? ● పుష్కరకాలంగా కొత్త రైలు లేదు, పెరగని రైళ్ల ఫ్రీక్వెన్సీ ● 2025–26 కేంద్ర బడ్జెట్‌పై పాతజిల్లా వాసుల కోటి ఆశలు
కేంద్ర బడ్జెట్ 2025–26ను నేడు(శనివారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రైల్వే కేటాయింపులు బాగానే ఉన్నా కేటాయించిన నిధులు ప్రాజెక్టు వేగం పెంచాయి తప్ప.. పూర్తి అయ్యేందుకు దోహదపడలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతేడాది వివిధ రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.647 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి అంతే మొత్తంలో ఇస్తుందా? లేదా హెచ్చు తగ్గులు చేస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఉమ్మడి జిల్లా కేంద్రంగా నడుస్తున్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలైన్, రామగుండం–మణుగూరు రైల్వేలైన్, పెద్దపల్లి బైపాస్ రైల్వేస్టేషన్– రైల్వేలైన్ పూర్తి, పెద్దపల్లి–నిజామాబాద్ డబ్లింగ్ తదితర ప్రాజెక్టులు పూర్తి కావాలంటే.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులు కావాలి. అదే విధంగా వేములవాడ, కొండగట్టులను ప్రసాద్ స్కీంలో చేర్పించడం, జిల్లాకు ట్రిపుల్ ఐటీ, నవోదయ స్కూల్స్ కేటాయింపుపైనా పార్లమెంటులో ఏం ప్రకటన వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 12 ఏళ్లుగా ఉమ్మడి జిల్లాకు కొత్త రైలు లేదు. కనీసం నడుస్తున్న రైళ్ల ఫ్రీక్వెన్సీ (ట్రిప్పులు) పెంచలేదు. ఈసారి బడ్జెట్‌లోనైనా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దయచూపాలని ఉమ్మడి జిల్లా వాసులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. –సాక్షిప్రతినిధి,కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment