హమాలీల మధ్య ‘పని’ వివాదం
● ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు నేపథ్యంలో సమస్య ● నేడు అధికారుల సమక్షంలో చర్చలు
పెద్దపల్లిరూరల్: స్థానిక సివిల్ సప్లయ్, మార్కెట్‌యార్డు హమాలీల మధ్య తలెత్తిన వివాదానికి పరిష్కారం లభించడం లేదు. ఈక్రమంలోనే కలెక్టరేట్‌లో ఉన్నతాధికారుల సమక్షంలో ఇరువర్గాల ప్రతినిధుల శనివారం చర్చలు జరగనున్నాయి. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల పౌరసరఫరాల గోదాం స్థలాన్ని ఆర్టీసీ బస్సు డిపోకు అప్పగించడంతో గోదాంను ఖాళీ చేయాల్సి ఉంది. దీనిని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలోని గిడ్డంగుల్లో ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు.
తలెత్తిన వివాదం..
స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఉండే ఏ గోదాములోనైనా హమాలీ పని తామే చేస్తామంటూ మార్కెట్ కమిటీ హమాలీలు పేర్కొంటున్నారు. అయితే ఏళ్లుగా పనిచేస్తున్న తమ సంగతేమిటని సివిల్ సప్లయీస్ గోదాముల్లో హమాలీలుగా పనిచేస్తున్న వారు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ యార్డు హమాలీల వాదన అర్థరహితమని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు హమాలీలకు నచ్చజెప్పేందుకు యత్నించినా మార్కెట్ హమాలీలు వినకపోవడంతో సమస్య జటిలమైంది.
నేడు అడిషనల్ కలెక్టర్ సమక్షంలో చర్చలు..
అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లయీస్ మేనేజర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల సమక్షంలో శనివారం హమాలీల వివాదంపై చర్చలు జరగనున్నాయి. సివిల్ సప్లయీస్, మార్కెట్ యార్డు హమాలీ ప్రతినిధుల వాదనలు విని అధికారులు సమస్యకు పరిష్కారం చూపే అవకాశాలు ఉన్నాయి.
మా పనిమాకే..
ఏళ్లుగా సివిల్ సప్లయీస్ గోదాముల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు గోదామును మార్కెట్‌యార్డుకు తరలించినా మా పనిమాకే దక్కాలి. కానీ, అక్కడ పనిచేసే హమాలీలు మమ్మల్ని పనికి రానివ్వకుండా అడ్డుకోవడం సరికాదు. అధికారులు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.
– తిరుపతి, సివిల్ సప్లయీస్
హమాలీ సంఘం అధ్యక్షుడు
పరిష్కరిస్తాం
పౌర సరఫరాల గోదామును మార్కెట్‌యార్డులోకి మార్చుతాం. అయితే మార్కెట్‌యార్డు, సివిల్ సప్లయీస్ హమాలీల మధ్య పనివిషయమై సమస్య తలెత్తింది. ఇరువర్గాలతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపుతాం.
– శ్రీకాంత్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం
Comments
Please login to add a commentAdd a comment