ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడం ఆ పార్టీకి నష్టం చేకూర్చిందా? ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు సాయం అందిస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాటలు ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయా? ఫలితాలను విశ్లేషిస్తే ఇవన్నీ నిజమని అనిపించక మానవు. ఢిల్లీ మొదలుకొని పంజాబ్, గుజరాత్, హర్యానాల్లోనూ పోటీ చేసిన ఈ పార్టీ గెలిచింది మాత్రం మూడంటే మూడు!
రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ పార్టీ ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, హర్యానాతో పాటు అసోంలో కూడా తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ, పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాల్లో ఆప్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో కలసి సీట్లను పంచుకుంది. ఢిల్లీలోని నాలుగు స్థానాల్లో ఆప్ అభ్యర్థులు బరిలో నిలిచారు. అదేవిధంగా హర్యానాలోని కురుక్షేత్ర, గుజరాత్‌లోని భావ్‌నగర్, బరూచ్, అస్సాంలోని దిబ్రూఘర్,సోనిత్‌పూర్‌ల నుంచి కూడా ఆప్ అభ్యర్థులు పోటీ చేశారు.
పంజాబ్‌లోని అన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉన్నందున 13 సీట్లలో కనీసం 10 సీట్లు గెలుచుకుంటామని ఆప్ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే హోషియార్‌పూర్, ఆనంద్‌పూర్ సాహిబ్, సంగ్రూర్ మినహా మిగిలిన 10 స్థానాల్లో ఆప్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఢిల్లీలో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకుని దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల నుంచి పోటీకి దిగింది. అయితే నాలుగు స్థానాల్లోనూ ఆప్ ఓటమిని చవిచూసింది. హర్యానాలోని కురుక్షేత్ర స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుశీల్ గుప్తా బీజేపీ అభ్యర్థి నవీన్ జిందాల్ చేతిలో 29 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
గత అసెంబ్లీ ఎన్నికల నుంచి గుజరాత్‌లో ఆప్ హల్ చల్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు భావ్‌నగర్, భరూచ్ స్థానాల్లో ఒంటరిగా పోటీకి దిగింది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యింది. ఈ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
దిబ్రూగఢ్, సోనిత్‌పూర్ స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దిబ్రూగఢ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సర్బానంద సోనోవాల్ విజయం సాధించారు. సోనిత్‌పూర్ సీటులో ఆప్ మూడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment