![Akepati Amarnath Reddy Slams Chandrababu Naidu Over Ys Vivekananda Reddy Assasination Case - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/5/Untitled-6.jpg.webp?itok=_d9YgBga)
కడప సెవెన్‌రోడ్స్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైఎస్ కుటుంబంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు డైరెక్షన్‌లో దుష్ప్రచారం జరుగుతోందని వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రం కడపలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వివేకా హత్య జరిగిందని గుర్తుచేశారు. చంద్రబాబు అప్పుడే నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి నిజాలు ఎందుకు వెలికి తీసుకురాలేదని ప్రశ్నించారు. నేడు పథకం ప్రకారం స్క్రిప్ట్ తయారు చేసుకుని దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారని చెప్పారు.
వైఎస్ కుటుంబానికి రక్తపు మరకలు అంటించాలని ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై బురద చల్లేందుకు యత్నించడం అన్యాయమని చెప్పారు. అవినాష్‌రెడ్డి సౌమ్యుడని, హత్యారాజకీయాలను ఏనాడూ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని యత్నించడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివేకానందరెడ్డి స్వయాన చిన్నాన్న అని, ఆ కుటుంబాన్ని సీఎం పట్టించుకోలేదనడం దుర్మార్గమని చెప్పారు. వైఎస్ కుటుంబానికి ఉభయ రాష్ట్రాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలున్నాయన్నారు.
వివేకా కుటుంబం చంద్రబాబు ఉచ్చులో పడరాదని కోరారు. వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టడం ద్వారా రాజకీయలబ్ధి పొందాలని చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యకేసులో దోషులను గుర్తించాలని తాము ఆరోజే డిమాండ్ చేశామని గుర్తుచేశారు. తమకు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి తదితరులపై అనుమానాలున్నాయని చెప్పారు. సీబీఐ అధికారులు వారిని ఎందుకు విచారించరని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను చట్టానికి అప్పగించాలన్నారు. వివేకా కుటుంబం అపోహాలు వీడి నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగేందుకు యత్నించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment