సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా గెలిచి సత్తా చాటుతారని భావించిన ముఖ్యనేతలే ఓటమి చవిచూడడంపై బీజేపీలో విస్మయం వ్యక్తమవుతోంది. పోటీచేసిన ముగ్గురు ఎంపీలు, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరాజయం పాలు కావడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించు కోలేకపోతున్నారు.
కరీంనగర్ ఎంపీగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రజల్లో అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుల్లో ముఖ్యుడైన బండి సంజయ్, ఒకప్పుడు బీఆర్‌ఎస్‌లో నంబర్–టుగా వెలిగి, ఇప్పటిదాకా ఓటమి ఎరగని ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవితపై గెలిచి సంచలనం సృష్టించిన ధర్మపురి అర్వింద్, ఫైర్‌బ్రాండ్ నేతగా గుర్తింపు పొంది దుబ్బాక ఉప ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు చేసిన రఘునందన్‌రావు, ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ పార్టీలో విస్తృతంగా సాగుతోంది.
పని చేయని బీసీ నినాదం
బీజేపీ బీసీ నినాదం, ఇతర పార్టీల కంటే అత్యధికంగా 36 సీట్లు బీసీలకు కేటాయించిన నేపథ్యం, అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే పార్టీ విధానపరమైన నిర్ణయం... ఈ ఎన్నికల్లో కనీసంగా పనిచేయలేదని విశ్లíÙస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎనిమిది మందిలో ముగ్గురు మాత్రమే బీసీలు ఉండటం, బీసీ సీఎం అభ్యర్థులుగా ముందువరుసలో నిలిచే సంజయ్, ఈటల, అర్వింద్ ఓటమి పాలవడం చూస్తుంటే బీసీ ప్రభావం ప్రశ్నార్థకంగానే ఉందని అంటున్నారు.
సంజయ్‌ను ఓడించేందుకు...
రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరై, బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నంత స్థాయిలో పార్టీ ఇమేజ్‌ని ఆమాంతం పెంచిన నేతగా గుర్తింపు పొందిన బండి సంజయ్ ఓటమికి పైకి కనిపించని కారణాలు ప్రభావితం చేసినట్టు అంచనా వేస్తున్నారు. కరీంనగర్ ఫలితాన్ని పోలింగ్ బూత్‌ల వారీగా విశ్లేషించిన పార్టీ నేతలు ముస్లిం, మైనారిటీ ఓటర్లు ఏకపక్షంగా సంజయ్‌కు వ్యతిరేకంగా ఓటేశారని లెక్కలు వేస్తున్నారు. ఎలాగైనా సంజయ్‌ను ఓడించాలంటూ పోలింగ్ సమయం నాటికి బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ మిలాఖత్ అయిందని ఆరోపిస్తున్నారు.
మొత్తం 390 పోలింగ్ బూత్‌లలో దాదాపు 200 బూత్‌లలో సంజయ్ ప్రత్యర్ధి గంగుల కమలాకర్ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. మిగిలిన 186 బూత్‌లలోనే బీఆర్‌ఎస్ అభ్యర్ధి అధిక ఓట్లు సాధించగలిగారు. ఈ నియోజకవర్గంలో ఉన్న 62 ముస్లిం ఓటర్ల ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక ఓట్లు గంగులకే పడ్డాయి. ఉదాహరణకు చూస్తే హుస్సేన్ పురాలోని 232 నుంచి 241 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 80 శాతానికిపైగా మైనారిటీ ముస్లిం ఓటర్లుండగా, వీటిలో పోలైన 6,764 ఓట్లలో సంజయ్‌కు కేవలం 259 మా త్రమే పడ్డాయి. ఈ బూత్‌లలో 4,979 ఓట్లు అంటే 80 శాతం కమలాకర్‌కు పడ్డాయి.
సంజయ్ 3,163 ఓట్లతో వెనకబడడం చూస్తే...ఈ ఓట్లే సంజయ్ ఓటమిని శాసించాయని గణాంకాలతో సహా పార్టీ నాయకులు ఉదహరిస్తున్నారు. ఇక ముస్లిం ఓటర్ల ప్రాబల్యమున్న 62 పోలింగ్ బూత్‌లలో ఒక్కటంటే ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత కనబరచకపోవడం చూస్తే కమలాకర్‌తో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలకు బలం చేకూరుతోందని విశ్లేషిస్తున్నారు. ప్రజల కోసం నిత్యం పోరాడే తనను ఓడించేందుకు ముస్లింలంతా ఏకమయ్యారని, హిందూ సమాజం ఇప్పటికైనా కళ్లు తెరవాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనినే స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు.
అంతటా తిరగడం వల్లనే ఈటలకు నష్టం
కేసీఆర్‌ను గజ్వేల్‌లో పోటీచేసి ఓడిస్తానంటూ ఈటల రాజేందర్ సవాల్ విసిరి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తన సిట్టింగ్ స్థానం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఈటలకు వ్యక్తిగతంగా నష్టం చేసిందని అంచనా వేస్తున్నారు. వరుసగా గెలుస్తూ వచ్చిన హుజూరాబాద్‌లో ఈ సారి త్రిముఖ పోటీ కారణంగా ప్రజా వ్యతిరేకత ప్రాతిపదికన కాంగ్రెస్ అధిక ఓట్లు చీల్చడంతో ఈటల అనూహ్యంగా ఓటమి పాలు కావాల్సి వచ్చిందని పార్టీ నాయకులు విశ్లేíÙస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment