
గత 58 నెలల పాలనతో సంక్షేమంతో పాటు గత పాలనను పోలుస్తూ.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తూ..
వైఎస్సార్, సాక్షి: ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారంలోకి దిగడంతో.. ఏపీలో ఎన్నికల వాతావరణంతో ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం ఇటు ప్రజలు, అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న ఈ 21 రోజుల ప్రచార యాత్ర.. ఇఛ్చాపురంతో ముగుస్తుంది. ఈ క్రమంలో తొలిరోజు ప్రొద్దుటూరులో నిర్వహించబోయే ప్రచార సభలో సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన ఆందోళనలు చేపట్టినా.. వాళ్ల సాధకబాధకాలను గుర్తించి భరోసా కల్పించేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేసినా.. చివరకు సుపరిపాలన తదనంతరం సిద్ధం సభలు నిర్వహించినా.. ఈ జననేతకు ప్రతీసారి జనం బ్రహ్మరథం పట్టారు. అయితే ఇప్పుడు సీఎం హోదాలో.. అదీ ఎన్నికలకు ముందు ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. దీంతో ప్రచార శైలి ఎలా ఉండనుంది?.. ప్రజా స్పందన ఏస్థాయిలో ఉండబోతోందో? అనే చర్చ నడుస్తోంది.
మేమంతా సిద్ధం యాత్రలో.. ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారని, ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇదివరకే ప్రకటించాయి. అలాగే.. గత 58 నెలల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును సాయంత్రం జరిగే సభల్లో ఆయన వివరిస్తారని తెలిపాయి. దీంతో ప్రొద్దుటూరు సభలో ఆయన ఆయా అంశాల్ని కచ్చితంగా ప్రస్తావిస్తారనేది ఊహించొచ్చు.
ఇదీ చదవండి: మరో యాత్రకు సిద్ధం
అలాగే గత పాలన- వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలనను ఆయన పోల్చి పలు అంశాల్ని ప్రస్తావించ్చొచ్చు. అదే సమయంలో కూటమిపైనా ఆయన విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో గజదొంగల ముఠాగా, తోడేల మంద, మోసకారులుగా చంద్రబాబు అండ్‌ను కో(యెల్లో మీడియాను కలిపి మరీ) అభివర్ణించిన సీఎం జగన్.. ఇప్పటి కూటమి లక్ష్యంగా విమర్శలు, పంచ్ డైలాగులు గుప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే.. 2014లో ఇదే కూటమి రాష్ట్రాన్ని మోసపూరిత హామీలతో రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారని.. దోచుకో పంచుకో దాచుకో ద్వారా అవినీతికి పాల్పడ్డారని.. అలాగే ప్రజలను ఎలా మోసం చేశారనే దాన్ని.. ఆయన ప్రముఖంగా ప్రస్తావించే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే.. కూటమిలో భాగమైన పవన్ కల్యాణ్, బీజేపీ, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌ను ఆయన టార్గెట్ చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను ఇంకా ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారాయన. ఇక ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇవ్వడం సీఎం జగన్ చేస్తూ వస్తున్నారు. తద్వారా విశ్వసనీయత, విలువల్ని చాటుతూ వస్తున్నారు. దీంతో.. ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమానికి కొనసాగింపుగా ఆయన ఏమైనా ప్రకటనలు చేస్తారా?.. పోనీ మేనిఫెస్టో ఎప్పుడనేదానిపై స్పష్టత ఇస్తారా? అని అంతా ఎదురు చూస్తున్నారు.
జగన్ కోసం జనమంతా..
ఇక.. సీఎం జగన్ సొంత జిల్లా నుంచే బస్సు యాత్ర ప్రారంభం అవుతుండడంతో తొలి ఎన్నికల ప్రచార సభ లక్షలాది మందితో జనసంద్రంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే తమ ప్రియతమ నాయకుడికి అండగా నిల్చేందుకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రొద్దటూరు వైపు అడుగులేస్తున్నారు. మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేలు ప్రాంతాల నుంచి అశేష ప్రజానీకం స్వచ్ఛందంగా తరలి రావొచ్చని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావటంతో పార్టీ కేడర్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలోని ముఖ్యనేతలతో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా ఈ సభకు హాజరు కానున్నారు.