విభజన హామీలు అమలు చేయాలి
హోదా ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే
విశాఖ రైల్వే జోన్ వెంటనే ఏర్పాటు చేయాలి
రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మేడా రఘునాధరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేడా రఘునాధ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక స్వావలంబన, సమ్మిళిత అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుసార్లు ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని కోరారని గుర్తుచేశారు.
ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం ఏపీ ప్రజల్ని మోసం చేయడం, వారికి అన్యాయం చేయడమేనని అన్నారు. టీడీపీ మద్దతుతోనే కేంద్రం ప్రభుత్వం నడుస్తున్నందున హోదా కోసం కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తేవాలన్నారు. విశాఖలో రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏపీలో నాలుగు నూతన ఓడరేవుల నిర్మాణం ప్రారంభం కావడంతోపాటు ఆరు ఓడరేవుల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. నూతన ఓడరేవుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రసారాలు నిలిపివేసిన టీవీ ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని కోరారు.
దాడుల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కూటమి పార్టీల నేతలు చేస్తున్న దాడుల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. దాడుల్ని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలైమనందున కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. దాడులు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment