ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది, బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్- మమతలను నింగి-నేలతో పోల్చారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఆప్ సాగిస్తున్న ప్రచారం గురించి కూడా సంజయ్ సింగ్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 23 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోందని, కార్యకర్తలంతా పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. ఇండియా కూటమిని వీడి ఎన్‌డీఏలో చేరిన బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై సంజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ కుమార్ నిష్క్రమణ అనూహ్యమని, విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆయన హఠాత్తుగా ఎన్డీఏలో చేరారన్నారు. ఈ విధంగా పార్టీలు మారితే స్వల్పకాలంలో అధికారాన్ని, ప్రయోజనాన్ని పొందవచ్చని, తరచూ పార్టీలు మారితే చరిత్ర హీనులవుతారని ఆరోపించారు. ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడి, ఇప్పుడు దానికి నితీష్ తలొగ్గుతారని తాను భావించలేదన్నారు.
ఇక మమతా బెనర్జీ విషయాని కొస్తే ఆమె బీజేపీకి వ్యతిరేకంగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్నారని సంజయ్ సింగ్ అన్నారు. అందుకే మమతకు నితీష్ కుమార్‌కు మధ్య నింగికి నేలకు ఉన్నంత తేడా ఉన్నదన్నారు. మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుండగా, నితీష్ కుమార్ బీజేపీకి సాగిలపడ్డారని ఆరోపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఇండియా కూటమికి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment