Bandi Sanjay Sensational Comments In Lok Sabha - Sakshi
Sakshi News home page

Bandi Sanjay: లోక్‌సభలో బండి సంజయ్‌ భావోద్వేగ కామెంట్స్‌

Published Thu, Aug 10 2023 6:06 PM | Last Updated on Thu, Aug 10 2023 7:02 PM

Bandi Sanjay Sensational Comments In Lok Sabha - Sakshi

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీపై సభలో సంజయ్‌ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని ఓ గజినీ అని అన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని సెటైరికల్‌ పంచ్‌ వేశారు. కేసీఆర్‌.. ఖాసిం చంద్రశేఖర రజ్వీ అని కామెంట్స్‌ చేశారు. అవిశ్వాసంలో భాగంగా బీజేపీ పక్షాన బండి సంజయ్ 10 నిమిషాలపాటు మాట్లాడారు.

సభకు శిరస్సు వంచి నమస్కారం..
లోక్‌సభలో బండి సంజయ్‌ తెలుగులోనే మాట్లాడుతూ.. దేశ్ కీ నేత.. దిన్ బర్ పీతా. యే కాంగీ, బెంగాల్ దీదీ, ఢిల్లీ కేజ్రీ, బీహార్ జేడీ, ఔర్ తెలంగాణ కేడీ.. మోదీని ఏమీ చేయలేరు. తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్ పవిత్ర దేవాలయం.. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సుష్మా స్వరాజ్‌కు నా సెల్యూట్. చీమల పుట్టలో పాములా తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం చేరింది. కేంద్రం పుష్కలంగా నిధులిచ్చినా కేసీఆర్ సహకరించడం లేదు. రైతు సగటు ఆదాయంకంటే సాగుపై కేసీఆర్ కుటుంబ ఆదాయం వందల రెట్ల ఎట్లా పెరిగాయి? అని ప్రశ్నించారు. ఇక, మణిపూర్‌కు ప్రధాని మోదీ వెళ్లలేదని అడిగే నైతిక అర్హత మీకుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు.. ఇందుకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని అన్నారు. 

రాహుల్‌ గాంధీపై ఫైర్‌..
భారతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ విరుచుకుపడ్డారు. ‘ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెలియదు. ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించుకుంటాడు. ఇంకోసారి ఫ్లయింగ్‌ కిస్ ఇస్తాడు. గజినీలాగా తయారయ్యాడు. ఇలాంటి వ్యక్తితో కలిసి అవకాశవాద కూటమి  అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం హాస్యాస్పదం. ఏ కాంగీ.. బెంగాల్ దీదీ.. ఢిల్లీ క్రేజీ.. బీహార్ జేడీ.. ఔర్ ఔర్.. తెలంగాణ కేడీ.. సభ్ లోగ్ మిల్ కర్ ఆయే తోబీ మోదీజీ కో నహీ రోకేంగే. భరతమాత జోలికొస్తే కన్ను పీకే ఆదర్శనేత నరేంద్ర మోదీ’అంటూ విరుచుకుపడ్డారు. మోదీ నాయత్వంలో ఎన్డీయే ప్రభుత్వం శక్తివంతమైన దేశంగా మారుతోందన్నారు. 

బీఆర్‌ఎస్‌ ఎంపీలకు సవాల్‌..
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామంటూ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ను పూర్తిగా తప్పుదోవ పట్టించాయన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఇదిగో నా రాజీనామా.. నిరూపించే దమ్ముందా? నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ముక్కు నేలకు రాసి సభకు క్షమాపణ చెబుతారా?’ అంటూ సవాల్ విసిరారు. 

సుష్మా స్వరాజ్‌కు సెల్యూట్‌..
ఈ పవిత్రమైన పార్లమెంట్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణను సాకారం చేసిన దేవాలయమిది. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వల్ల 1400 మంది యువకులు బలయ్యారు. జై తెలంగాణ అంటూ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ట్రైన్‌కు ఎదురుగా పోయి చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే సభ వేదికగా తెలంగాణ బిల్లు పెడతారా, మేం వచ్చాక ఇవ్వమంటారా? అంటూ సుష్మా స్వరాజ్ నిలదీస్తే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూడటానికి మీరు బతికి ఉండాలని అప్పీల్ చేస్తే యువతకు భరోసా ఇచ్చిన మహానేత. చిన్న రాష్ట్రాలకు బీజేపీ మొదటి నుండి అనుకూలం. తెలంగాణకు అనుకూలంగా కాకినాడ తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని అన్నారు.  

బీఆర్‌ఎస్‌పై సెటైర్లు..
చీమల పుట్టలో తాచుపాము జొర్రినట్లు.. తెలంగాణలో ఒక కుటుంబం  చేరింది. బీఆర్ఎస్ అంటే.. భ్రష్టాచార్ రాక్షస సమితి. బీఆర్ఎస్ లీడర్ పేరు ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ. తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. బీఆర్ఎస్ నేతది ఒకే పని.. అదేమిటంటే.. రాత్ బర్ పీతా.. దిన్ బర్ సోతా.. కిస్ సే బీ నహీ మిల్ తా.. యే హై దేశ్ కీ నేత అని సెటైర్లు వేశారు. కేసీఆర్‌ ఆస్తులు ఎంత పెరిగాయంటే.. అధికారంలోకి రాకముందుతో పోలిస్తే 2018 నాటికి ఖాసీం రజ్వీ కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగాయి. ఆయన భార్య ఆస్తులు 18వందల శాతం పెరిగాయి. ఆశ్యర్యమైన విషయమేంటంటే.. తెలంగాణ రైతుల సగటు ఆదాయం  1 లక్షా 12 వేల 836 రూపాయలు.. కేసీఆర్ వ్యవసాయం ఆదాయం కోటి రూపాయలు.. కేటీఆర్ 59 లక్షల 85 వేలు. రైతుల కంటే 5 వేల శాతం అధికం. ఆయన కోడలు ఆదాయం 2 వేల శాతం అధికం. నా తెలంగాణలో రైతులు నష్టపోతున్నారని అన్నారు. 

నిధులు దారి మళ్లించిన కేసీఆర్..
కొత్త రాష్ట్రానికి కేంద్రం పుష్కలంగా నిధులిచ్చింది. తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసింది. రూ.9 లక్షల 60 వేల కోట్లకుగా అప్పులిచ్చింది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్న ఘనత మోదీదే. టాయిలెట్లకు నిధులిస్తే దోచుకున్నారు. రూ.4 వేల కోట్ల అంచనాలతో రూపొందించిన భగీరథను 40 వేల కోట్లకు పెంచి దోచుకున్నారు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్న ఘనత మోదీదే. ఉచితంగా రేషన్ అందిస్తుంటే వాటిని అమ్ముకుంటున్న దొంగలు బీఆర్ఎస్ నేతలు. జాతీయ ఉపాధి హామీ పైసలను కూడా దారి మళ్లించారు. 

మణిపూర్ సరే.. తెలంగాణ సీఎం చేస్తున్నదేమిటి?
మణిపూర్ ఘటనపై అమిత్ షా జీ చెప్పారు. దాంట్లోకి నేను వెళ్లను. తెలంగాణలో ఎంత పెద్ద దుర్ఘటన జరిగినా తెలంగాణ సీఎం ఎందుకు వెళ్లలేదు? రైతులు చనిపోయినా వెళ్లరు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా వెళ్లరు.. మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణాలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, భూ కబ్జాల సంగతేంది? అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు..
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. గల్లీలో కుస్తీ పడుతున్నట్లు యాక్షన్ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తూ మోదీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాయి. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు ఓటేసినట్లే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కవల పిల్లలు. తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతమైంది. కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ స్థానిక ఎన్నికల్లో జీరో. ఈ ఫలితాలే నిదర్శనం. తెలంగాణలో అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యం అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: బుద్వేల్‌ భూముల వేలం.. తొలి సెషన్‌లో రికార్డులు బ్రేక్‌ చేసిన ప్లాట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement