సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పంపిన డబ్బులతోనే కాంగ్రెస్ ఎన్నికల్లో పంపిణీకి సిద్ధమైందని నిందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గౌరీబిదనూరు, బాగేపల్లి నియోజకవర్గాల్లో సంజయ్ పర్యటించారు.
బాగేపల్లిలో పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, అసెంబ్లీ అభ్యర్ధి మునిరాజుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అక్కడి మీడియాతోనూ మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసే పనిచేస్తున్నాయని, ఆ పార్టీలకు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని వ్యాఖ్యానించారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ముస్లిం రిజర్వేషన్లను పెంచే కుట్ర జరుగుతోందన్నారు. ‘కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటుకు రూ.10 వేల పంచేందుకు సిద్ధమైంది. ఆ పైసలన్నీ తెలంగాణ సీఎం కేసీఆర్ పంపినవే. వాటిని పంచేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమైనరు. ఒక్క పైసా తక్కువిచ్చినా ఊరుకోకండి. ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓట్లేసి కాంగ్రెస్‌ను ఖతం చేయండి. కేసీఆర్ మహా తెలివైన వాడు. మొన్నటిదాకా జేడీఎస్ కు పైసలిచ్చిండు. ఆ పార్టీ అధికారంలోకి రాదని తెలిసే సరికి కాంగ్రెస్ పంచన చేరిండు. కుమారస్వామి ఫోన్ చేసినా ఎత్తడం లేదట. కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నడు. ’అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment