బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్‌ షా | Sakshi
Sakshi News home page

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్‌ షా

Published Mon, May 6 2024 4:18 AM

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన  బహిరంగసభకు హాజరైన బీజేపీ శ్రేణులు, ప్రజలు (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా

మేం గెలిస్తే.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతాం 

పరేడ్‌గ్రౌండ్స్, నిజామాబాద్, కాగజ్‌నగర్‌ సభల్లో అమిత్‌ షా స్పష్టీకరణ

తెలంగాణలో రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి (ఆర్‌ఆర్‌) ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు 

తెలంగాణను రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చేశారు..  బీజేపీ గెలిస్తే కాంగ్రెస్‌ ఏటీఎంలో డబ్బులు లేకుండా చేస్తాం 

బీఆర్‌ఎస్‌ అవినీతి సొమ్మును ఢిల్లీ లిక్కర్‌ వ్యాపారంలో ఎంత పెట్టారో కేసీఆర్‌ చెప్పాలి 

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో చేసింది 

నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం 

షుగర్‌ ఫ్యాక్టరీల మూసివేతకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లే కారణం 

వాటిని సహకార పద్ధతిలో ప్రారంభించి నడిపిస్తామని వెల్లడి

రేవంత్‌..! నిన్ను వాడుకుని వదిలేస్తారు
సీఎం రేవంత్‌రెడ్డీ.. నా మాట వినండి.. కాంగ్రెస్‌ నాయకత్వం మిమ్మల్ని వాడుకుని, వదిలించుకుంటుంది. కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం సైగలతో తెలంగాణలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. వచ్చేనెల 6వ తేదీన ఫలితాలు వెలువడ్డాక.. వాటిని చూసి మిమ్మల్ని కాంగ్రెస్‌ విడిచిపెట్టడం ఖాయం.. గుర్తుంచుకోండి.

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/ ఆసిఫాబాద్‌: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని.. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే, మతపరమైన (ముస్లిం) రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను పెంచుతామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ ఉన్నంతకాలం దేశంలో ఎవరూ రిజర్వేషన్లను తొలగించకుండా చూస్తామని.. ఇది మోదీ గ్యారెంటీ అని చెప్పారు. 

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నుంచి ఆర్‌ఆర్‌ (రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి) టాక్స్‌ వసూలు చేసి దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం ఖర్చు చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చేశారని విమర్శించారు. బీజేపీని అత్యధిక ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఆ ఏటీఎంలో డబ్బుల్లేకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రం, ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభల్లో అమిత్‌ షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పిస్తామని నేను ఇటీవల ఓ సభలో చెప్పాను. ఆ వీడియోను ఎడిట్‌ చేసి మోదీ రిజర్వేషన్లు తొలగిస్తారని అన్నట్టుగా ప్రజల్లో దు్రష్పచారం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ రిజర్వేషన్లు తొలగించలేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) 10శాతం రిజర్వేషన్లతో విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించింది. 

మోదీ ఆర్టికల్‌ 370ను రద్దు చేశారు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేశారు. రామమందిర నిర్మాణం చేశారు. ఆర్టికల్‌ 370ను రద్దుచేస్తే కశ్మీర్‌లో రక్తపుటేరులు పారుతాయని రాహుల్‌గాంధీ అడ్డుపడే ప్రయత్నం చేశారు. అది చేసి ఐదేళ్లు గడిచిపోయాయి రక్తపుటేరులు కాదు.. కనీసం రాళ్ల దాడి చేసే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారు. పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే.. పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి, ఉగ్రవాదులను మట్టుపెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిది. 

వారివి ఓటు బ్యాంకు రాజకీయాలు 
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్‌ పార్టీలు సంతుష్టీకరణ రాజకీయాలకు పెట్టింది పేరు. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్‌ఎస్, సీ అంటే కాంగ్రెస్‌.. ఈ మూడు పార్టీలు ఓటుబ్యాంకు కోసం రామనవమి యాత్రకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టాయి. బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. కేంద్రంలో 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. అయోధ్య సమస్యను పరిష్కరించలేదు. మోదీ ఐదేళ్లలో పరిష్కరించి, రామమందిర నిర్మాణం పూర్తి చేశారు. రామాలయ ప్రారంబొత్సవానికి ఆహ్వానించినా.. ఒకవర్గం ఓట్ల కోసమే రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గే అయోధ్యకు రాలేదు. 

ఇండియా కూటమికి నాయకత్వమేది? 
ఇప్పుడు ఎన్నికల్లో ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటమి ఉన్నాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్‌ పార్టీ కావాలా? 23 ఏళ్లు సీఎం, పీఎంగా ఉన్నా ఒక్క అవినీతి మరకలేని మోదీ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి. దీపావళి నాడు కూడా సెలవు లేకుండా దేశ సైనికులతో కలసి పండుగ జరుపుకునే మోదీ ఓవైపు ఉంటే.. నోట్లో బంగారు స్పూన్‌తో పుట్టి, ఎండ పెరగగానే బ్యాంకాక్, థాయ్‌లాండ్‌కు చెక్కేసే రాహుల్‌ గాంధీ మరోవైపు ఉన్నారు.. ఎవరు కావాలి? ఒకవేళ ఇండియా కూటమి గెలిస్తే.. ప్రధాన మంత్రి ఎవరు? అంటే ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ఉంటారని అంటున్నారు. అలాంటి ఇండియా కూటమి భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారి ఏదైనా వస్తే కాపాడగలదా? ఆ మోదీకే ఉంది. యావత్‌ భారతానికి ఉచితంగా, వేగంగా వ్యాక్సినేషన్‌ చేయించారు. ఆ ముందు చూపుతోనే మనమంతా బతికిపోయాం. 

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో చేసింది 
తెలంగాణలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది. అన్నిరకాలుగా ఆదుకుంటోంది. ఇక్కడి ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ మోదీ ప్రభుత్వమే సంపూర్ణంగా నిధులిచ్చింది. పసుపు బోర్డు ఇచ్చింది. 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు, రూ.20వేల కోట్లతో రీజనల్‌ రింగ్‌రోడ్డు, రూ.1,100 కోట్లతో ఎంఎంటీఎస్‌ మంజూరు చేశాం. పీఎంజీఎస్‌వై కింద రూ.6 వేల కోట్లు ఇచ్చాం. 

బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఏర్పాటు, హసన్‌–చర్లపల్లి ఎల్‌పీజీ గ్యాస్‌ పైప్‌లైన్, రూ.2 వేల కోట్లతో కృష్ణపట్నం–హైదరాబాద్‌ పెట్రోల్‌ పైప్‌లైన్, రూ.1,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫాక్టరీ పునఃప్రారంభం వంటి చేపట్టాం. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ నుంచి నాలుగు వందే భారత్‌ రైళ్లు ప్రారంభించాం. అవినీతిమయ కాంగ్రెస్‌ను తరిమికొట్టేందుకు, దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లతో మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు అందరూ ముందుకురావాలి. తెలంగాణలో 12 సీట్లలో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా మారుస్తాం..’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. 

నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు.. షుగర్‌ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం.. 
పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తాం. ఎంపీ అర్వింద్‌ వెంటపడి మరీ పసుపు బోర్డు ఏర్పాటును సాధించుకున్నారు. మరోసారి అర్వింద్‌ను గెలిపిస్తే మరిన్ని ప్రయోజనాలు చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల కారణంగానే నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మేం వాటిని రైతుల భాగస్వామ్యంతో సహకార పద్ధతిలో తెరిపిస్తాం. బీడీ కార్మీకుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక ఆస్పత్రి నిర్మిస్తాం.

రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌ తప్పుడు ప్రచారం: కె.లక్ష్మణ్‌ 
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ తప్పుడు ఆరోపణలు, ప్రచారాన్ని తిప్పికొట్టడం ద్వారా బీజేపీ దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవబోతోందని చెప్పారు.

మోదీ మళ్లీ ప్రధాని కావాలి: ఈటల రాజేందర్‌ 
దేశం సుభిక్షంగా ఉండాలంటే.. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయాలని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారమంతా వట్టి బూటకమన్నారు.  

Advertisement
 
Advertisement