తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రాజీనామా పత్రాలు చూపుతున్న టీడీపీ నేతలు
ఇప్పటికే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన టీడీపీ
తాజాగా ఈ సీటు బీజేపీకని ప్రచారం.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
సీటు మారిస్తే ఊరుకోబోమని అధిష్టానానికి హెచ్చరిక
పలువురు టీడీపీ నేతల రాజీనామా
రాజీనామా పత్రాలు జోన్–2 ఇన్‌చార్జి సుజయ్ కృష్ణకు అందజేత
అనపర్తి నుంచి పోటీకి ససేమిరా అంటున్న సోము వీర్రాజు
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీలో ‘కమలం’ కల్లోలం రేగింది. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం దక్కించుకున్న బీజేపీ.. అనపర్తి అసెంబ్లీ సీటులోనూ పోటీ చేస్తుందన్న ప్రచారం టీడీపీ శ్రేణుల్లో అగ్గి రాజేసింది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తొలి జాబితాలోనే ప్రకటించారు. ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఈ తరుణంలో అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలైంది. దీంతో టీడీపీ అధిష్టానం వైఖరికి వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.
ఈ సీటును బీజేపీకి ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి వెళుతున్న టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ఆదివారం అడ్డుకున్నారు. టికెట్ ఖరారుపై చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ ప్రచారానికి వెళ్లవద్దని పట్టుబట్టారు. తొలుత బిక్కవోలు మండలం కాపవరంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి మహాలక్ష్మి చేస్తున్న ఇంటింటి ప్రచారాన్ని.. నల్లమిల్లిలో మనోజ్‌రెడ్డి ప్రచారాన్ని టీడీపీ, జనసేన నాయకులు అడ్డుకున్నారు.
బిక్కవోలులో అనపర్తి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో రామకృష్ణారెడ్డి పాల్గొనకుండా అడ్డుకున్నారు. అనంతరం రామకృష్ణారెడ్డి తన నివాసం వద్ద పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ అంశంపై వేచి చూడాలని చెప్పారు. ఇది జరిగి ఒక రోజు గడిచినా ఇప్పటివరకూ చంద్రబాబు స్పందించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశాయి. తమ రాజీనామా పత్రాలను టీడీపీ జోన్–2 ఇన్‌చార్జి సుజయ్ కృష్ణ రంగారావుకు టీడీపీ ముఖ్య నేతలు సోమవారం అందజేశారు. అనపర్తిలో బీజేపీ ఎలా గెలుస్తుందో చూస్తామంటూ సవాల్ విసిరారు. ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలోనూ చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం 615 ఓట్లు సాధించిన బీజేపీకి ఈ సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
సోము వీర్రాజు ససేమిరా?
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఆయన మాత్రం ఎంపీగా తప్ప అసెంబ్లీకి పోటీ చేయనని రెండు రోజుల క్రితమే తన సన్నిహితుల వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో అనపర్తి నుంచి బరిలోకి దింపేందుకు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తోంది.
టీడీపీ నేతలకు అన్యాయం
స్వప్రయోజనాల కోసం చంద్రబాబు జనసేన, బీజేపీతో జత కట్టడంతో ఇప్పటికే పలువురు టీడీపీ సీనియర్ నేతలకు అన్యాయం జరిగిన విషయం తెలిసిందే. జనసేన నేత దుర్గేష్‌ను నిడదవోలు పంపించి, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు తీరని ద్రోహం చేశారన్న విమర్శలు ఉన్నాయి.
రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానాన్ని సైతం బీజేపీకి, రాజానగరం అసెంబ్లీ సీటును జనసేనకు కట్టబెట్టి టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు. బాబుకంటే సీనియర్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థిత్వం విషయంలో స్పష్టత ఇచ్చేందుకు నానా తిప్పలూ పెట్టారు. ఇప్పుడు అనపర్తి విషయంలోనూ అదే పంథా కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment