అందరికంటే ముందు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన
తెలంగాణలోని మొత్తం 17 సీట్లకు గాను 9 స్థానాలకు ఎంపిక
సిట్టింగ్‌లలో ముగ్గురికి అవే స్థానాలు ఖరారు.. పెండింగ్‌లో ఆదిలాబాద్
గతంలో పోటీ చేసిన, కొత్తగా చేరిన వారికి అవకాశం
పలు సీట్లలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నుంచి వచ్చే బలమైన నేతల కోసం వెయిటింగ్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అందరి కన్నా ముందుగా లోక్‌సభ ఎన్నికలకు ‘సై’రన్ మోగించింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లకుగాను 9 స్థానాలకు అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్)లకు తిరిగి అవే స్థానాలు ఇచ్చారు. తాజాగా పార్టీలో చేరిన ఇద్దరు బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో బీబీ పాటిల్‌కు జహీరాబాద్, పి.రాములు కుమారుడు భరత్‌కు నాగర్‌కర్నూల్ సీటు దక్కాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌కు మల్కాజిగిరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి చేవెళ్ల, బూర నర్సయ్యగౌడ్‌కు భువనగిరి, పార్టీ నేత మాధవీలతకు హైదరాబాద్ టికెట్లను ప్రకటించారు.
ఏకాభిప్రాయం రాక.. పెండింగ్
తొలి జాబితాలో ప్రకటించిన 9 సీట్లలో 5 బీసీలకు కేటాయించారు. దీనితో మిగతా 8 సీట్లలో ఒకటి మాత్రమే బీసీలకిచ్చే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెండింగ్‌లో పెట్టిన సీట్లలో 4 జనరల్, 4 రిజర్వ్‌డ్ (రెండేసి చొప్పున ఎస్సీ,ఎస్టీ) స్థానాలు ఉన్నాయి. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ సీట్లలో అభ్యర్థులపై ఏకాభిప్రా యం కుదరకపోవడంతో పెండింగ్ లో పెట్టాలని జాతీయ నాయకత్వ ం నిర్ణయించింది. ఈ సీట్లలో ఒకరి కంటే ఎక్కువ మంది పోటీపడుతుండడం, రాష్ట్ర పార్టీ నేత లు వేర్వేరు వ్యక్తులకు మద్దతు తెలుపుతుండడంతో ఎటూ తేల్చ లేని పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం.
ఈ స్థానాలతోపాటు ఖమ్మం, నల్లగొండ, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్ సీట్లకు సంబంధించి.. పార్టీలో ప్రస్తుతమున్న వారిలో కంటే బలమైన నేతలెవరైనా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి వస్తారా? అని వేచిచూస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎంపీతోపాటు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆయా స్థానాల్లో పార్టీపరంగా అంతగా బలం లేనందున.. అన్నీ కుదిరితే వీరిని చేర్చుకుని పార్టీ తరఫున బరిలో నిలపాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.
మురళీధర్‌రావుకు దక్కని చాన్స్..
జాతీయ స్థాయిలో పలుకుబడి ఉండి పార్టీలో సీనియర్ నేతగా, మధ్యప్రదేశ్ రాష్ట్రపార్టీ ఇన్‌చార్జిగా ఉన్న పి.మురళీధర్‌రావుకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం కూడా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో సన్నాహాలు చేసుకోవాలని సూచించిందని, దీనితో ఏడాదిన్నరగా ఆయన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రచారం చేసుకున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
కానీ సీనియర్ నేత, బీసీల్లో పలుకుబడి ఉన్న ఈటల రాజేందర్ మల్కాజిగిరి నుంచి పోటీకి ఉత్సాహం చూపడంతోపాటు టికెట్ ఇస్తే గెలుస్తానని నాయకత్వాన్ని ఒప్పించినట్టు వివరిస్తున్నాయి. ఇక రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల్లో కొందరు అభ్యంతరాలు చెప్పడంతోపాటు పలు సీట్లలో కొత్త పేర్లను ప్రతిపాదించడంతో ఇతర స్థానాల్లో అభ్యర్థుల ఖరారు పెండింగ్‌లో పడినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
పలు సీట్లపై పీటముడి
► ఆదిలాబాద్ సీటు కోసం సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుతోపాటు రమేశ్ రాథోడ్ పేరును, టికెట్ ఇస్తామంటే పార్టీ చేరేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చిన మాజీ ఎంపీ గోడం నగేశ్ పేరును బీజేపీ పెద్దలు పరిశీలించినట్టు తెలిసింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ సీటును పెండింగ్ పెట్టారని పార్టీ నాయకులు చెప్తున్నారు.
►మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు దాదాపు ఖరారైనా.. మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కూడా ఇక్కడ పోటీకి గట్టిగా ప్రయత్నిస్తుండటంతో పీటముడి పడినట్టు సమాచారం.
► మెదక్ నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు వైపు జాతీయ నాయకత్వం కొంత మొగ్గినా.. ఒకరిద్దరు రాష్ట్ర నేతలు అంజిరెడ్డి పేరును ముందుకు తెచ్చినట్టు తెలిసింది.
► పెద్దపల్లి, వరంగల్ ఎంపీ టికెట్లకు హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు ఇద్దరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సిద్ధమైనట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
► ఇక నల్లగొండలో పోటీకోసం రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే.. మహబూబాబాద్ కోసం ఓ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
► పెండింగ్‌లో ఉన్న ఎనిమిది సీట్లకుగాను రెండో జాబితాలో మరో మూడు, నాలుగు పేర్లను ప్రకటిస్తారని.. మిగతా వాటికి చివర్లో ఖరారు చేయనున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment