రాంచీ: జార్ఖండ్‌లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటూ జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీని కోసం కృషి చేస్తానంటూ శపథం చేసిన ఆయన.. తనను జైలులో నిర్బంధించేందుకు బీజేపీ కుట్రపన్నిందంటూ మండిపడ్డారు.
మనీలాండరింగ్ కేసులో బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్, శనివారం.. జేఎంఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో సామాజిక వ్యవస్థను ధ్వంసం చేయడంలో బీజేపీకి ఆరితేరిపోయిందని విమర్శలు గుప్పించారు. మాపై కుట్ర పన్నిన వారికి తగిన సమాధానం చెబుతాం. బీజేపీ శవపేటికకు చివరి మేకు వేసే సమయం వచ్చిందని.. జార్ఖండ్‌లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ధ్వజమెత్తారు.
కాగా, భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్(48)కు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనను తప్పుడు కేసులో ఇరికించి, ఐదు నెలలపాటు జైల్లో పెట్టారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యర్తలు, జర్నలిస్టుల గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment