ఏళ్ల తరబడి అడవిని నమ్ముకొని పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసిన బీఆర్‌ఎస్ ఎన్నికల్లో లబి్ధదారుల మద్దతు తమకే ఉంటుందని భావిస్తోంది. తమకే గంపగుత్తగా ఓట్లు పడుతాయని లెక్కలు వేసుకుంటోంది.
అయితే తాము 2006లోనే పోడు భూములకు పట్టాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఆ తర్వాత పట్టాలు ఇచ్చే ప్రక్రియలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పోడు పట్టాలు పొందిన గిరిజనులు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
1,50,012 మంది రైతులు.. 4,05,601 ఎకరాలకు పట్టాల పంపిణీ
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 4,14,353 మంది రైతులు తాము సాగు చేసుకుంటున్న 13.18లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు 56.6శాతం మంది గిరిజనులు 8.15లక్షల ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పరిశీలించి అటవీ హక్కుల చట్టం, మంత్రివర్గ ఉపసంఘం సూచనలతో అర్హులైన గిరిజన రైతుల జాబితాను రూపొందించారు. మొత్తంగా 26 జిల్లాల్లోని 1,50,012 మంది రైతులకు 4,05,601 ఎకరాలకు గానూ పట్టాలు పంపిణీ చేశారు.
ఇందులో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595మంది రైతులకు 1,51,195ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 24,972 మంది రైతులకు 70,434 ఎకరాలు కాగా.. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు రైతులకు ఎకరం భూమికి పట్టాలు అందించారు. అయితే పట్టాలు పొందిన గిరిజన కుటుంబాలన్నీ తమకే ఓటు వేస్తాయని, ఆ ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ హయాంలోనే 3,31,070 ఎకరాలను ఇచ్చామంటున్న కాంగ్రెస్
ఇక కాంగెస్ పార్టీ గతంలో తాము కూడా పట్టాలు పంపిణీ చేశామని, ముందుగా తమకే ఆ ఆలోచన వచ్చిందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణలోని హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన 99,486 మంది రైతులు సాగుచేసుకునే 3,31,070 ఎకరాలకు అటవీహక్కుల చట్టం ద్వారా భూ హక్కు పత్రాలు అందజేశారని గుర్తు చేస్తున్నారు.
మిగిలిన రైతులకు కూడా పట్టాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని, ఈలోపు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కావడం, బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో జాప్యం జరిగిందని అంటున్నారు. పోడు పట్టాల పంపిణీలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు పెట్టిందని, కాంగ్రెస్ హయాంలో మాత్రం నిజమైన రైతులకు పట్టాలు ఇచ్చిందని, ఎవరు ఎన్ని చెప్పినా.. గిరిజనుల మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని, మా పార్టీ అభ్యర్థులే గెలుస్తారని నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు.
గిరిజనేతరులు ఎటువైపో..
ఇక ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనేది ప్రధాన చర్చగా మారింది. ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో సమానంగా గిరిజనేతరులు పోడు భూమిని సాగు చేసుకుంటున్నారు. అయితే దశాబ్దాల తరబడి వారు సాగుచేసుకుంటున్నా.. నేటి వరకు హక్కు పత్రాలు అందలేదు. గిరిజన చట్టాలను సవరించి పట్టాలు ఇస్తారని వారు భావించగా.. అది సాధ్యపడలేదు.
పట్టాలు ఏమో కానీ కనీసం ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు, రైతుబంధు, రైతుబీమా వచ్చి, తమ పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తే చాలని గిరిజనేతర రైతులు కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు దీనిపై ఏ పార్టీ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో గిరిజనేతరుల మద్దతు ఎటువైవో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
-ఈరగాని భిక్షం
Comments
Please login to add a commentAdd a comment