
సాక్షి, తణుకు: ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో సీట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ పలు చోట్ల కూటమి కార్యకర్తల మధ్య పొసగడం లేదు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీ పెద్దల తీరును తప్పుబడుతున్నారు. దీంతో, కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది.
ఇదిలా ఉండగా.. తణుకు కూటమి రాజకీయంలో సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు. తణుకులో టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో నేడు తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన చీఫ్ పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో తణుకు రాజకీయం హీటెక్కింది.
అయితే, కూటమి నేతల ప్రచారం సందర్భంగా తణుకు జనసేన ఇన్‌చార్జ్ విడివాడకు ఆహ్వనం అందలేదు. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దల తీరుపై జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తణుకు టికెట్ టీడీపీకి ఇవ్వడాన్ని జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో నేడు వీరి ప్రచారంపై ఉత్కంఠ నెలకొంది.
అసంతృప్త నేతలతో మాట్లాడి చల్లార్చే ప్రయత్నం
చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా పర్యటించే తణుకు, అమలాపురంలో టీడీపీ, నిడదవోలు, పి.గన్నవరంలో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి అభ్యర్థులకు కొందరు సహకరించడంలేదనే ప్రచారం ఉంది. వీరిద్దరి పర్యటనలో అసంతృప్త నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. చంద్రబాబు-పవన్ ఉమ్మడి వ్యూహం కూటమిలో అసంతృప్తులను చల్లారుస్తుందా? టికెట్ దక్కని నేతలు ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తారా? చూడాలి మరి.