చంద్రబాబుకు వత్తాసుగా తోడు దొంగ | Chandrababu arrest is unfortunate, says Design Tech MD | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు వత్తాసుగా తోడు దొంగ

Published Wed, Sep 13 2023 3:02 AM | Last Updated on Wed, Sep 13 2023 8:38 AM

Chandrababu arrest is unfortunate says Design Tech MD - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. రూ.371 కోట్లు కొల్లగొట్టడంలో చంద్రబాబుకు భాగస్వాములైన నిందితులతో పత్రికా ప్రకటనలు ఇప్పిస్తూ ప్రజలను మోసగించేందుకు యత్నిస్తోంది. తాజాగా డిజైన్‌టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్‌ను టీడీపీ తెరపైకి తీసుకురావడమే ఇందుకు నిదర్శనం. ‘అసలు ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టులో అవినీతే జరగలేదని, తాము రూ.370 కోట్ల మేర సాఫ్ట్‌వేర్‌ సరఫరా చేశామని, చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం’ అని ఆయనతో ఓ వీడియో ప్రకటన విడు­దల చేయించింది.

కానీ, అసలు వాస్తవం ఏమిటంటే ఇదే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకోవడంలో డిజైన్‌టెక్‌ కంపెనీ ఎండీ వినాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్‌నే చంద్రబాబు సాధనంగా చేసుకున్నారు. ఈ కుంభకోణంలో వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్‌ పాత్రను సీఐడీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా నిగ్గు తేల్చాయి.

ఒప్పందంలో పేర్కొన్నట్టుగా సీమెన్స్, డిజైన్‌టెక్‌ కంపెనీలు 90శాతం వాటా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతో సహా రూ.371 కోట్లను డిజైన్‌టెక్‌ కంపెనీకే విడుదల చేశారు. ఆ నిధులను డిజైన్‌టెక్‌ కంపెనీ వివిధ షెల్‌ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబుకు చేర్చింది. ఆ విషయాన్ని ఆధారాలతో సహా నిర్ధారించాకే సీఐడీ వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు చేసింది.

కొరఢా ఝళిపించిన ఈడీ
ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్‌ ప్రధాన పాత్ర పోషించారని ఈడీ కూడా తేల్చింది. డిజైన్‌టెక్‌ కంపె­నీతో పాటు ఇతర షెల్‌ కంపెనీల కార్యాల­యాల్లో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించింది. దాంతో మనీ లాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసి వికాస్‌ ఖన్వేల్కర్‌తోపాటు సీమెన్స్‌ ఇండియా హెడ్‌గా వ్యవహ­రించిన సుమన్‌ బోస్, షెల్‌ కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్‌ల సృష్టికర్తలు, చార్టెడ్‌ అకౌంటెంట్లు ముకు­ల్‌­­చంద్ర అగర్వాల్, సురేశ్‌ గోయల్‌­లను ఈడీ అరెస్టు చేసింది.

అంతేకాదు డిజైన్‌టెక్‌ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్లను ఈడీ అటాచ్‌ చేసింది కూడా. ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో అంతటి కీలక పాత్ర పోషించిన వికాస్‌ ఖన్వేల్కర్‌తో అసలు ఆ కుంభకోణమే జరగ­లేదని టీడీపీ చెప్పించడం విస్మయ­పరుస్తోంది. ఎందుకంటే ఈ కేసు నిరూపణ అయితే చంద్రబాబు, వికాస్‌ ఖన్వేల్క­ర్‌తో పాటు ఇతర నిందితులకు కూడా న్యాయస్థానం కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశా­లున్నాయి. అందుకే ఈ కేసును పక్కదారి పట్టించేందుకే ఆయనతో ఇలాంటి అవాస్తవ ప్రకటనలు ఇప్పిస్తోందన్నది సుస్పష్టం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement