ప్రతిపక్షాలన్నీ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి. రెండు సున్నాలు కలిసినా.. నాలుగు సున్నాలు కలిసినా ఫలితం సున్నానే. ఎన్ని సున్నాలు కలిసినా వచ్చేది పెద్ద సున్నాయే. ఒకరైతే పార్టీ స్థాపించి 15 ఏళ్లవుతున్నా ఇవ్వాళ్టికీ ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థి లేడు. ప్రతి గ్రామంలో జెండా మోసే కార్యకర్త లేడు. ఆయన జీవితమంతా చంద్రబాబును భుజానికెత్తుకుని మోయడమే. చంద్రబాబు దోచుకున్నది పంచుకోవడంలో ఆయన పార్ట్‌నర్. వారిద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తారు. ప్రజలకు మంచి చేయాలనే మనస్తత్వం వారికి లేదు.
– వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎన్నికల సంగ్రామంలో తమ పొత్తు ప్రజలతోనేనని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పొత్తుల కోసం ప్రతిపక్షాలు వెంపర్లాడుతున్నాయని.. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా ఫలితం సున్నానేనంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై వ్యంగ్యోక్తులు విసిరారు. ‘మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు. దేవుడ్ని.. ఆ తర్వాత ప్రజలనే నమ్ముకుంటాడు. మన పొత్తు నేరుగా ప్రజలతోనే’ అని పేర్కొన్నారు. దేవుడి దయతో ప్రజలకు మనం చేసిన మంచే మన బలమని.. మన ధైర్యం.. మన ఆత్మవిశ్వాసమని స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
ఇంటింటికీ వెళ్లిన పార్టీ మనదే..
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన 99 శాతం వాగ్ధానాలను అమలు చేసిన ప్రభుత్వం మనది. సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందించిన ప్రభుత్వం మనది. ఇదే మన ధైర్యం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించిన ప్రభుత్వం మనది. ఇలాంటివన్నీ సాధ్యపడతాయని ఎవరైనా కలలోనైనా అనుకున్నారా? ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా, అర్హతే ప్రామాణికంగా మీ బిడ్డ బటన్ నొక్కగానే ఆర్థిక సహాయం అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వస్తుందని ఎవరైనా అనుకున్నారా? అలాంటి విప్లవాత్మక చర్యలు మన సొంతం.
నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకం అమలూ ఒక విప్లవమే. ఎన్నికల మేనిఫెస్టోను వెంటబెట్టుకుని ఇంటింటికీ వెళ్లి ఇదిగో వీటిని అమలు చేశామంటూ ప్రజల ఆశీర్వాదాన్ని తీసుకున్న పార్టీ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్ సీపీనే. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. అప్పుడు ఎమ్మెల్యేల్లో కొంతమందికి కష్టం అనిపించినా ఇప్పుడు వారిలో చిరునవ్వులు చూస్తున్నాం.
బాబు జనంలో ఉన్నా జైల్లో ఉన్నా ఒకటే!
చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆయనకు విశ్వసనీయత లేదు. అలాంటి వ్యక్తి ఎక్కడున్నా ఒకటే. చంద్రబాబును, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటే.. మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలే. అదే మన పార్టీని చూసినప్పుడు, జగన్‌ను చూసినప్పుడు సామాజిక న్యాయం గుర్తుకొస్తుంది. గ్రామాల్లో మారిన వైద్యం, స్కూళ్లు, వ్యవసాయం, ప్రాంతాల మధ్య న్యాయం, లంచాలు, వివక్షలేని వ్యవస్థలు గుర్తుకొస్తాయి.
ఫోన్ తీసుకుని అక్క చెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వెళ్లే పరిస్థితి గుర్తుకు వస్తుంది. దిశ యాప్ æద్వారా వారికి లభించే భరోసా గుర్తుకు వస్తుంది. 1.24 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ను ఐదు సార్లు ఊపినా.. ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా పోలీసులు వెంటనే వారి వద్ద ఉంటారు. రాష్ట్రంలో మంచి పోలీసన్న రూపంలో జగనన్న ఆ మహిళలకు గుర్తుకొస్తారు. ఎస్‌వోఎస్ కాల్ ఫీచర్ ద్వారా ఇప్పటికే 30,336 మంది అక్కచెల్లెమ్మలు సహాయం పొందారు.
రాజకీయమంటే..
చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్‌కు రాజకీయం, విశ్వసనీయత అంటే తెలియదు. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలనే ఆలోచన వారికి లేదు. వారికి తెలిసిన రాజకీయమంతా అధికారంలోకి రావడం.. దోచుకోవడం.. పంచుకోవడం.. తినడమే. రాజకీయం అంటే ఇది కాదు. చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషి గుండెలో బతికి ఉండటం.. ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండటం అన్నది మనకు తెలిసిన రాజకీయం.
మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు. నేరుగా ప్రజలతోనే మన పొత్తు. అబద్ధాలు, మోసాలను నమ్మకండి. మన ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే దాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోండి. కురుక్షేత్ర యుద్ధంలో మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవండి. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ ప్రజలను అడగడానికి ధైర్యం చేయని విషయాలను మీ బిడ్డ అడగగలుగుతున్నాడు.
కష్టమైనా మాట తప్పలేదు..
మన ప్రభుత్వం చేసిన మంచి పనులే మన బలం. కోవిడ్ సమయంలోనూ, ఆదాయాలు తగ్గిన సమయంలో కూడా రాబడి తగ్గినా ఇచ్చి న మాటకు కట్టుబడి కష్టమైనా సరే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మంచి చేశాం. ఇదే మన బలం. మాట నిలబెట్టుకోవడం, విశ్వసనీయత అనే పదానికి నిజమైన అర్థం చెప్పడం మన బలం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలకు అండగా నిలవడం మన బలం. అవ్వాతాతల గురించి ఆలోచించి సమయానికి వారికి మంచి చేయడం మన బలం. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలలో మనం తెచ్చి న మార్పులు మన బలం.
అధికార వికేంద్రీకరణ, పారదర్శకత వ్యవస్థ, లంచాల్లేని వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకురావడం మన బలం. ఇన్ని బలాలతో మనం ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నాం. ఏ గ్రామాన్ని చూసినా, ఏ నియోజకవర్గాన్ని చూసినా ప్రతి ఇంటికీ మనం చేసిన మంచే కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో కూడా మనం తీసుకొచ్చి న మార్పు కనిపిస్తుంది. అలాంటప్పుడు వైనాట్ 175? అని అడుగుతున్నా.
‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి
Comments
Please login to add a commentAdd a comment