సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి దాడుల ఎపిసోడ్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు ఎవరి జోలికి వెళ్లారు.. అదే సమయంలో ఎవరైనా మా వాళ్ల జోలికి వస్తే ఊరుకోరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటాను. మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడు.. ఏం కాదు అనుకోకండి. మహేష్ గౌడ్ వెనుక నేను ఉంటాను. మా వాళ్లు ఎవరి జోలికి పోరు.. ఎవరైనా వస్తే ఊరుకోరు. రా చూసుకుందామని కౌశిక్ రెడ్డి ఎందుకు సవాల్ చేశాడు. వెళ్లి వీపు పగలకొడితే.. కొట్టారు అంటారు.
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా అంశాన్ని సీఎం రేవంత్ మళ్లీ తెరపైకి తెచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని నిరూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేశాం. ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. రూ.2లక్షలు మాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించాం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
రూ.2లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామన్నారు. రైతు రుణమాఫీపై ఆనాడు హామీ ఇచ్చాం.. అమలు చేసి చూపించాం. రాజీనామా సవాల్ చేసిన వాళ్లు ఎక్కడికి పోయారు. రాజీనామా చేయకుండా ఎక్కడ దాకున్నారు. రుణమాఫీ అయిన రైతుల వివరాలు హరీష్‌రావుకు పంపిస్తాం. మొన్నటి గెలుపు సెమీ ఫైనల్ మాత్రమే. 2029లో ఫైనల్స్ ఉన్నాయి. మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ‘మీ కంటే పాలన మాకే బాగా తెలుసు’: కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment