దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రతి 2 వేల జనాభాకు సచివాలయంలో మహిళా పోలీస్.. ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? అమ్మ ఒడి, చేయూత, రైతు భరోసా, ఆసరా, మత్స్యకార భరోసా, తోడు తదితర పథకాల ద్వారా పేదలకు అండగా నిలవచ్చని చంద్రబాబు ఏనాడైనా అనుకున్నారా?
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో 2014 నాటికి రాష్ట్రానికి రూ.1,20,556 కోట్ల అప్పులు ఉంటే, 5 ఏళ్లలో అంటే 2019 నాటికి అవి రూ.2,68,225 కోట్లకు చేరుకున్నాయి. అవే కాకుండా చంద్రబాబు చెల్లించకుండా దాదాపు రూ.39 వేల కోట్ల బకాయిలు పెట్టారు. ఇవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కు కనిపించవు. బాబు ప్రభుత్వం నిర్వాకం వల్ల మన ప్రభుత్వం వచ్చాక ఇచ్చే అప్పులో రూ.16,419 కోట్ల కోత పెట్టారు. చంద్రబాబు చేసిన పాపాలు మనల్ని వెంటాడుతున్నాయి. పాపాలు చంద్రబాబువి. ప్రక్షాళన బాధ్యత మనది’ అని సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.
శాసనసభలో గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం చెబుతూ గత ప్రభుత్వ తీరును, ప్రస్తుతం చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. ‘ప్రభుత్వ గ్యారెంటీ మీద 2014 నాటికి చేసిన అప్పులు రూ.14,028 కోట్లు ఉంటే, చంద్రబాబు హయాంలో 2019 నాటికి అవి రూ.58 వేల కోట్లకు చేరాయి. విద్యుత్ సంస్థల పంపిణీకి బకాయిలు 2014 నాటికి రూ.2,893 కోట్లు ఉంటే 2019 నాటికి రూ.21,540 కోట్లకు పెరిగాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల అప్పు 2014 నాటికి రూ.20,703 కోట్లు ఉంటే.. 2019 నాటికి అవి రూ.68,596 కోట్లకు పెరిగాయి. దీన్ని ఆర్థిక వ్యవస్థ అంటారా.. ఆర్థిక అరాచకం అంటారా?’ అని నిలదీశారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
దుష్ప్రచారమే ఎల్లో మీడియా అజెండా
► దాదాపు రూ.1800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టి పోయినా చంద్రబాబు పాలన బాగుందని.. అదే జగన్ వాటిని చెల్లించి టైమ్ టు టైమ్ పూర్తి ఫీజు ఇస్తున్నా కూడా ఏమీ బాగా లేదంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒకే రోజు రెండు స్టోరీలు ఇచ్చాయి.
► ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడుకు అనిపిస్తుంది. కానీ పిల్లలు, వారి తల్లిదండ్రులకు కాదు. చంద్రబాబు మధ్యాహ్న భోజన పథకంలో 8 నెలలు బకాయి పెట్టి పోయారు. అప్పుడు నీళ్ల చారు ఇస్తే, ఇవాళ రోజుకొక మెనూతో పిల్లలకు పౌష్టికాహారం ఇస్తున్నాం. కానీ కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లుగా ఎల్లో మీడియాకు చంద్రబాబు ముద్దు.
అన్నీ ఆయనే చేశారంటూ డాంబిక ప్రచారం
► స్కూళ్లలో కనీస సదుపాయాలు లేకపోవడంతో ఆడ పిల్లలు చదువులు మానేస్తున్నారని చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? ఆడపిల్లల రక్షణ గురించి 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? బడులలో టాయిలెట్ల గురించి యోచించారా?
► ఇటువంటి ఈ పెద్దమనిషి సెల్‌ఫోన్ నేనే కనిపెట్టా.. హైదరాబాద్ నేనే కట్టా.. అదిగో హైపర్ లూప్.. ఇదిగో బులెట్ ట్రైన్.. ఇక్కడే ఎయిర్ బస్.. బిల్‌గేట్స్ నా కంప్యూటర్ నాలెడ్జ్ చూసి మూర్ఛబోయాడు.. సత్య నాదెళ్లకు నేనే చదువులు చెప్పించాను.. పీవీ సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించాను.. అని బడాయిలు, కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతారు.
బాబు హయాంలో జరిగి ఉంటేనా!
చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల సంఖ్య ఒక్క లక్ష పెరిగినా చాలు.. ప్రపంచ విద్యా రంగానికే చంద్రబాబు చుక్కాని... చుక్కా రామయ్య కంటే చంద్రబాబు గొప్ప విద్యావేత్త.. 100 శాతం అక్షరాస్యత ఉన్న దేశా«ల అధ్యక్షులు, ఐక్యారాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం కరకట్ట మీద పడిగాపులు కాస్తున్నారు.. ఇలా ఎల్లో మీడియాలో నెలల తరబడి కథనాలను మనం చూసే వాళ్లం. చంద్రబాబు పాలనలో అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చినా బ్రహ్మాండంగా ఉందని, రెండేళ్లు బకాయి పెట్టినా చాలా బాగుందని ఎల్లో మీడియా ప్రచారం చేసేది.
ప్రభుత్వ బడులను చంపేశారు..
► చంద్రబాబు ప్రభుత్వం నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం పని చేస్తే.. మనం ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకుపోవడం కోసం పని చేస్తున్నాం.
► ఈ తరం పిల్లలు కూడా వారి పొలాల్లో కూలీలుగా, వారి వ్యాపారం, పరిశ్రమల్లో వెట్టిచాకిరి చేయాలన్న ఆలోచన చంద్రబాబుది. అందుకే ఇంగ్లిష్ మీడియంను అడ్డుకోజూశారు. రాబోయే ప్రపంచంలో ఎక్కడైనా బతికేందుకు, ఎదిగేందుకు అవకాశం ఉన్న చదువులు చదివించాలన్నది మన విధానం.
లంచం లేకుండా ఒక్క పథకం ఇచ్చారా?
► బాబు పాలనలో ఏ పథకం అయినా లంచం లేకుండా ఇచ్చారా? ఇవాళ ప్రజలకు కావాల్సింది లంచాలతో పని చేసే జన్మభూమి కమిటీలా? లేక అవినీతి లేని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థనా? ప్రతి నెల ఒకటో తేదీన ఆదివారం అయినా, పండగ అయినా సరే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అంటే 2019 జనవరి వరకు చంద్రబాబు పెన్షన్‌గా ఇచ్చింది నెలకు రూ.1000 మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment