సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం బాధాకరమని ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. దీనిపై పార్టీ పెద్దల వద్ద చర్చ జరిగిందని తెలిపారు. త్వరలో ఏఐసీసీ ఇంఛార్జి నేతృత్వంలో సమీక్ష చేసుకుంటామన్నారు. త్వరలో ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యవేక్షణకు వస్తారన్నారు. పార్టీ ధిక్కరణ చర్యలకు పాల్పడే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్‌ను ఎవరూ సింగిల్‌గా గెలిపించలేరు. పార్టీలో ఉండాలనుకునేవారు కలిసి పనిచేయాల్సిందేనని అన్నారు.
'ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తూ బహుజనులు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోంది. ప్రభుత్వ కళాశాలలు మూసేస్తున్నారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇస్తున్నారు. తెలంగాణ లిక్కర్ పాలసీ ఢిల్లీ, పంజాబ్ పాలసీని కాపీ కొట్టినట్లు ఉంది. లిక్కర్ వ్యాపారంలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక అవకాశం ఇస్తున్నారు. యువతను లిక్కర్, డ్రగ్స్‌కు అలవాటు చేస్తున్నారు. తెలంగాణ లిక్కర్ స్కాం పై సిబిఐ విచారణ జరగాలి' అని పేర్కొన్నారు.
ప్రజల దృష్టి మరల్చడానికి కేసిఆర్ ప్రోటోకాల్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లినపుడు మోడీ కాళ్ల మీద పడి వస్తారు. ఇక్కడికి ప్రధాని వస్తుంటే నాటకాలు అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్, బీజేపీ పంచాయతీ అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో దొంగలే దొంగ అన్నట్టు ఉందన్నారు. గవర్నర్‌కి అనుమానం ఉంటే హోంశాఖకి ఫిర్యాదు చేయాలన్నారు. తెలంగాణలో ఫోన్లు ట్యాప్ అవుతున్నది నిజమే. ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారు. గవర్నర్ ఫోన్ ట్యాప్ అయితే ఇక ఎవరికి రక్షణ ఉంటుంది అని ప్రశ్నించారు. దీని పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేత విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment