సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ అసత్యాలను వినసొంపుగా చెప్పారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే బీజేపీకి బీఆర్‌ఎస్, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతున్నట్టు కనిపిస్తోందన్నారు. తమ పార్టీ నేత భారత్ జోడో ప్రస్తావనను సభలో తేవడంతో పాటు దానిపై కేటీఆర్ ఇష్టంవచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం దీనికి బలం చేకూరుస్తోందని, గతంలో రాష్ట్ర సర్కార్‌ను విమర్శించిన గవర్నర్ సైతం ప్రశంసల్లో ముంచెత్తడాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ప్రతిపక్ష సభ్యులుగా తమకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ ఇష్టారీతిన కామెంట్స్ చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రగతి గురించి గొప్పగా చెబుతూ రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లకుపైగా అప్పులు, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్‌లో అత్యధిక ధరలున్న రాష్ట్రంగా నిలవడం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడం, వ్యవసాయరంగ సమస్యలు, కరెంట్‌కోతలు వంటి వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
తనతోపాటు వస్తే భూపాలపల్లి, పెద్దపల్లిలలో కరెంట్ కోతలున్న విషయాన్ని నిరూపిస్తామని, అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఈ అంశం చెబుతున్నామన్నారు. కాళేశ్వరంను అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ప్రచారం చేస్తున్నారని, దానివల్ల ఎంతమందికి ప్రయోజనం కలిగింది, అదనంగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్‌లో ఈ లిఫ్ట్‌స్కీంలకు, విద్య, వైద్యం తదితర కీలకరంగాలకు కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి గతేడాది 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామన్న హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్‌సీలో నమోదు చేసుకున్న నిరుద్యోగులే 26 లక్షల మంది ఉంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment