సాక్షి, హైదరాబాద్/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. బ్యాలెట్ రూట్‌లో ఆరు గ్యారంటీ హామీలను ఇవ్వనుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ ‘విజయభేరి’ సభా వేదికగా అగ్రనేత సోనియాగాంధీ ఈ గ్యారంటీ కార్డు స్కీమ్‌లను ప్రకటించనున్నారు. ఈ హామీలేమిటనే దానిపై టీపీసీసీ వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘మహాలక్ష్మి, చేయూత, అంబేడ్కర్ అభయ హస్తం, యువ వికాసం, రైతు భరోసా’తోపాటు మరో గ్యారంటీ కార్డు స్కీమ్‌ను వెల్లడించనున్నారు.
మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు నెలకు రూ.3వేల నగదు సాయం.. చేయూత పథకం కింద నెలకు రూ.4 వేల సామాజిక పింఛన్లు.. అభయ హస్తం పేరుతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం.. యువ వికాసం కింద 2 లక్షల ఉద్యోగాల భర్తీ.. రైతు భరోసా పేరుతో ఏటా రైతులకు రూ.15వేల పెట్టుబడి సాయం వంటి హామీలను ఇవ్వనున్నట్టు తెలిసింది. వీటితో పాటు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, రూ.2లక్షల రైతు రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులకు విద్యా సాయం, బీసీ కులవృత్తులకు ఆర్థిక చేయూత వంటి హామీలనూ ఇవ్వనున్నట్టు సమాచారం.
నిజానికి ఈ నెల 17న పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ భావించింది. కానీ గ్యారంటీ కార్డు స్కీమ్‌లపై ఫోకస్ చేసి, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో.. ఆరు గ్యారంటీలకు పరిమితమవుతున్నామని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే పూర్తిస్థాయి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని అంటున్నాయి.
నేటి కాంగ్రెస్ షెడ్యూల్ ఇదీ..
రెండో రోజు ఆదివారం ఉదయం 10:30 గంటలకు సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం కానుంది. సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు ఇందులో పాల్గొంటారు. సాయంత్రం 4:45 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. అనంతరం సీడబ్ల్యూసీకి హాజరైన నాయకులంతా తుక్కుగూడలో జరిగే విజయభేరి బహిరంగ సభకు బయల్దేరుతారు.
సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు సభ జరుగుతుంది. సభ ముగిశాక జాతీయ, వివిధ రాష్ట్రాల నాయకులు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు కేటాయించిన చోటికి వెళతారు. నేతలు ఆయా నియోజకవర్గాల్లోనే రాత్రి బస చేస్తారు. సోమవారం నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ గ్యారంటీ కార్డు స్కీమ్‌ల గురించి ప్రచారం చేస్తారు.
మూడు వేదికలు.. భారీగా ఏర్పాట్లు
తుక్కుగూడ బహిరంగ సభ కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సభా స్థలిలో మూడు వేదికలు సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సుఖ్వీందర్‌సింగ్ సుఖు, సిద్ధరామయ్య, అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్‌తోపాటు 84 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూర్చోనున్నారు.
కుడివైపున ఏర్పాటు చేసిన రెండో వేదికపై మాజీ కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలు, పీసీసీ చీఫ్‌లు ఆసీనులవుతారు. ఎడమవైపు ఏర్పాటు చేసిన మూడో వేదికను డీసీసీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కళాకారులకు కేటాయించారు. మొత్తంగా మూడు వేదికలపై కలిపి 320 మందికిపైగా ఉంటారు.
♦ సభలో సోనియా గాంధీ, రాహుల్, ఖర్గేతోపాటు టీపీసీసీ చీఫ్ రేవంత్, భట్టి విక్రమార్క ఐదుగురు మాత్రమే ప్రసంగించనున్నారు.
♦ సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు ఐదు లక్షల మందికిపైగా తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా నేతలకు జనసమీకరణ టార్గెట్లు పెట్టారు.
♦ తుక్కుగూడకు వచ్చి పోయే నాలుగు ప్రధాన రహదారుల వెంట స్వాగత తోరణాలు, భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో నింపేశారు. సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం ఇటు ఫ్యాబ్‌సిటీ నుంచి అటు ఓఆర్‌ఆర్ వెంట ఖాళీగా స్థలాలను సిద్ధం చేశారు.
♦ కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎంలు హాజరవుతుండటంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 61 మంది మంది ఎస్సైలు, 600 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు.
♦ సాయంత్రం ఐదు గంటలకు బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్ నుంచి ర్యాలీగా బయలుదేరే ముఖ్య నేతల వాహనాలు శంషాబాద్, ఓఆర్‌ఆర్ మీదుగా తుక్కుగూడకు చేరుకుంటాయి.
ఒకే వేదికపై ముగ్గురు గాంధీలు
రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఢిల్లీ వేదికగా జరిగే పార్టీ సమావేశాలు, టెన్ జన్‌పథ్‌లో జరిగే కార్యక్రమాలకు మాత్రమే ఈ ముగ్గురు కలసి హాజరవుతారని.. ఢిల్లీ వెలుపల ఒకే కార్యక్రమంలో, అదీ ఓ బహిరంగ సభలో పాల్గొంటుండటం అరుదైన ఘటన అని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆదివారం సాయంత్రం తుక్కుగూడ సభలో ఈ ముగ్గురితోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఇతర జాతీయ నాయకత్వమంతా పాల్గొంటుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment