సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)’ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో శని, ఆదివారాల్లో జరగనున్న ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అతిరథ మహారథులంతా పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. శనివారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సభ్యులకు టీపీసీసీ విందు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ మొదలవుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఐదు కీలక అంశాలు ఎజెండాగా..
సీడబ్ల్యూసీ భేటీ ముగిసే మరునాటి నుంచే పార్లమెంటు ప్రత్యేక భేటీ జరుగుతుండటం, ఆ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెడుతుందన్న అంచనాల నేపథ్యంలో.. హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఏం చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
శని, ఆదివారాల్లో జరిగే ఈ సమావేశాల్లో ఐదు కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించనుంది. ‘త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, భారత్ జోడో యాత్ర–2 నిర్వహణ, 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి’పై కాంగ్రెస్ కీలక నేతలు చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇదే సమయంలో దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతృత్వంలో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ, ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కోవాల్సిన తీరు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ పార్టీలో జోష్ కోసం
త్వరలో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయని.. ఈ క్రమంలో రాష్ట్ర కేడర్‌లో జోష్ నింపడం, బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ఇవ్వడం కోసం ఇక్కడ సమావేశాలు పెట్టారని చర్చ జరుగుతోంది.
చదవండి: నేడు సోనియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి తుమ్మల
శుక్రవారమే చేరుకున్న 52 మంది
సీడబ్ల్యూసీలోని సాధారణ సభ్యులతోపాటు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 84మంది సమావేశాలకు హాజరుకానున్నారు. శుక్రవారమే 52 మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరిలో హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్‌సింగ్ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, రమేశ్ చెన్నితాల, కొడుక్కునిల్ సురేశ్, శశిథరూర్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా, రాజీవ్‌శుక్లా, పవన్‌ఖేరా, యశోమతి ఠాకూర్, దీపేందర్ సింగ్ హుడా, ఫూలోదేవి, లాల్జీదేశాయ్, తారిఖ్ అన్వర్, మీరా కుమార్, నెట్టా డిసౌజా, అల్కా లాంబా, బీకే హరిప్రసాద్, మాణిక్యం ఠాగూర్, ఇబోబిసింగ్, ప్రతిభా సింగ్, మనీశ్ తివారీ, గౌరవ్ గొగోయ్, భక్తచరణ్‌దాస్, సుప్రియా షినాటె, దిగ్విజయ్‌సింగ్, కుమారి షెల్జా తదితరులు ఉన్నారు.
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్, సిద్ధరామయ్య, భూపేశ్ భగేల్, మరికొందరు నేతలు శనివారం రానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీ, విజయభేరి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచి్చన కాంగ్రెస్ జాతీయ నేతలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు.
బహిరంగ సభ.. నియోజకవర్గ పర్యటనలు
సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాక 17న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో కాంగ్రెస్ ‘విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ఆ సభా వేదికపై నుంచి కాంగ్రెస్ ఎన్నికల హామీలుగా గ్యారంటీ కార్డు స్కీంలను సోనియాగాంధీ ప్రకటించనున్నారు. ఇక ఈ నెల 18న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు జాతీయ స్థాయి నేతలు వెళ్లి.. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
బొట్టు పెట్టి.. మంగళ హారతి పట్టి..
సీడబ్ల్యూసీ, విజయభేరి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ నేతలకు టీపీసీసీ ఘనంగా స్వాగతం పలికింది. కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఇతర నేతలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి జాతీయ నేతలు తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకోగా.. మహిళా నేత కత్తి కార్తీకగౌడ్ వారందరికీ బొట్టు పెట్టి, మంగళ హారతి ఇచ్చి ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: డేంజర్ జోన్‌లో భారత్, తీవ్రవైన కరువు దేశంగా..
Comments
Please login to add a commentAdd a comment