సాక్షి, విజయవాడ: ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? అనే సందేహం కలుగుతోందంటూ చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధరల నియంత్రణలో ఇంత దారుణంగా ప్రభుత్వం ఫెయిలవుతుందని తాను ఊహించనేలేదన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ట్రూ అప్ ఛార్జీల 17 వేల కోట్ల రూపాయలు భారం రూపంలో మోపుతున్నారంటూ ఆయన నిలదీశారు.
‘‘ఏపీ చరిత్రలో ఇంత భారం ఏనాడూ మోపలేదు. ట్రూ అప్ ఛార్జీల భారంపై ఈనెల 19న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన చేపడతాం. నవంబర్ నెలాఖరు వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తాం. ట్రూ అప్ ఛార్జీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున పోరాడతాం. కరెంట్ ఛార్జీలు మోపితే కచ్చితంగా అదే మీకు శాపం అవుతుంది. డిసెంబర్‌లో విద్యుత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’’ అని రామకృష్ణ హెచ్చరించారు.
‘‘నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలను నియంత్రించలేకపోతున్నారు. చంద్రబాబు బుస్ బుస్ అనడం తప్ప ఏం ఉపయోగం లేదు. నాదెండ్ల మనోహర్ అక్కడక్కడా తిరిగినా ఏం ప్రయోజనం. ముఖ్యమంత్రులు, మంత్రుల మాట ఒక్కడు ఖాతరు చేయడం లేదు. మంత్రుల హుకరింపులు తప్ప ధరలు తగ్గిందే లేదు. ఒక్క వస్తువుపై ఒక్క రూపాయి కూడా తగ్గలేదు’’ అని రామకృష్ణ దుయ్యబట్టారు.
‘‘ఉచిత ఇసుకను అధికారపార్టీ ఎమ్మెల్యేలే ఫెయిల్ చేశారు. మీ ఎమ్మెల్యేలే బ్లాక్ చేసి అమ్ముకుంటుంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం చెప్పిన మాట ఏదీ అమలు కావడం లేదు. ప్రభుత్వం చెప్పిన మాట ఎవరూ వినే పరిస్థితి ఏపీలో కనిపించడం లేదు. నీటిపారుదల రంగంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరగబోతోందనే ఆందోళన నెలకొంది. గోదావరి, కృష్ణా,పెన్నా నదులను అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. పోలవరం అంశంలో కేంద్రం పదేపదే ఆటంకాలు కలిగించాలని చూస్తోంది. కానీ కేంద్రం వైఖరితో అన్ని రకాలుగా మనకు ప్రమాదం పెరుగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి’’ అని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘పోలవరం ఎత్తు 4.15 మీటర్లకు కుదించాలనే ప్రయత్నం జరుగుతోంది. ఏపీ ప్రయోజనాలు నెరవేరాలంటే పోలవరం 45.72 మీటర్ల ఎత్తు ఉండాల్సిందే. ఎత్తు తగ్గించడం వల్ల నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.25 వేల కోట్లు ఆదాయం చేసుకోవాలని చూస్తున్నారు. పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్ధ్యం తగ్గించాలని చూస్తున్నారు. నిధులు ఆదా చేసుకునేందుకు పరిహారం ఎగ్గొట్టేందుకే ఈ ప్రయత్నాలు. ఎత్తు తగ్గింపు, కాలువల సామర్ధ్యం తగ్గింపు ద్వారా 29 వేల కోట్లు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. పదే పదే ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు పోలవరం విషయంపై కేంద్రంతో ఏం మాట్లాడుతున్నారు. పోలవరం విషయంలో కేంద్రం ఏం చెప్పింది?. మీరు ఏం వివరించారో ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని రామకృష్ణ నిలదీశారు.
‘‘విభజన బిల్లులో 6 ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉంది. 194 టీఎంసీల నీటిలో కోత పెట్టాలని చూస్తున్నారు. గోదావరి, కృష్ణానది జలాల్లో ఏపీకి అన్యాయం జరగకుండా చంద్రబాబు చూడాలి. పోలవరం పై చంద్రబాబు తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. రాజకీయ, ఇరిగేషన్, రైతు సంఘాలతో చర్చించాలి. పోలవరం పార్టీ వ్యవహారం కాదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. నదీ జలాల్లో మరోసారి అన్యాయం జరిగితే ఏపీ భవిష్యత్తు అంధకారమే. పోలవరంపై చంద్రబాబు తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment