సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఎక్కడా లేనిరీతిలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్నాటకలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విమర్శించారు. కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే అంధకారం తప్పదని తెలంగాణ ప్రజలకు అర్థమవుతోందని ‘ఎక్స్ (ట్విట్టర్)’ వేదికగా మండిపడ్డారు. ‘‘కర్ణాటకలో వ్యవసాయానికి ఐదు గంటల కరెంటు ఇవ్వడం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం.
కాంగ్రెస్ వైఫల్యాలను చూసేందుకు కర్నాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ దగాపడిన రైతులు తెలంగాణకు వచ్చి అన్యాయాలను వివరిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఓవైపు కర్నాటక ప్రజలు పుట్టెడు కష్టాలు పడుతుంటే అవి పట్టించుకోకుండా డీకే శివకుమార్ తెలంగాణకు ఓట్ల వేటకోసం వచ్చారా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.
కర్నాటక ఎన్నికల సందర్భంగా ఐదు గ్యారెంటీలు అంటూ హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్.. ఆ తర్వాత సవాలక్ష కొర్రీలు పెడు తూ ప్రజలతో ఆడుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. అక్కడ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయిందని, చార్జీల వాతతో కర్నాటక చీకటి రాజ్యంగా మారిందని విమర్శించారు.
కరెంటు కోతలతో బెంగళూరు సహా వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయని, రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని స్థితిలో అన్నభాగ్య పథకం అటకె క్కిందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహలక్ష్మి పథకాలకు గ్రహణం పట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ కమిషన్లకు కాంగ్రెస్ ద్వారాలు తెరిచిందని ఆరోపించారు. కర్ణాటకలో అన్ని రంగాలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్‌ను నమ్మేందుకు తెలంగాణ సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment