సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీకి అభ్యర్థులు దొరక్కపోవడం, పొత్తుల నేపథ్యంలో శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యం ఆ పార్టీని పట్టిపీడిస్తున్నాయి. ఓ వైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించడం టీడీపీ అధిష్టానం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. చాలాచోట్ల తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలంటేనే అభ్యర్థులు వెనుకాడుతున్నారు. మెజార్టీ ఎంపీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
సాధారణంగా ఎన్నికలకు ముందు నుంచే అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు ప్రారంభించేవారు. ఈ ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీసేవారు. ఇప్పుడు అసలు ఆ పార్టీలో ఆ హడావుడి ఏమీ కనిపించడం లేదు. మరోవైపు పొత్తుల వల్ల నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దశలో జనసేన–టీడీపీ మధ్య సీట్ల పంపకం కత్తిమీద సాములా మారనుంది. దీనికితోడు బీజేపీతోనూ పొత్తు కోసం బాబు తహతహలాడుతున్న నేపథ్యంలో స్థానాల కేటాయింపు మరింత సంక్లిష్టంగా మారే ఆస్కారం ఉందనే వాదన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
సీఎం జగన్ ఎత్తుగడలతో కలవరం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలు టీడీపీని కలవరపెడుతున్నాయి. సీఎం చకచక వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రకటించడంతోపాటు సామాజిక సమతూకం పాటిస్తుండడం, కొత్త అభ్యర్థులు ప్రజల్లోకి త్వరగా వెళ్లేలా చూడడం వంటి చర్యలు టీడీపీని సతమతం చేస్తున్నాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం సొంత సోషల్ మీడియా, ఎల్లో మీడియా, నోటి ప్రచార వ్యూహాలతో బలంగా ఉన్నట్టు కలరింగ్ ఇచ్చుకునేందుకు యతి్నస్తోంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమీ బాగోలేవని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ఆత్మరక్షణగా తొలి జాబితా విడుదలకు యత్నం !
బలహీనతలను కప్పిపుచ్చుకునేందుకు, క్యాడర్‌ను సమాధానపరిచేందుకు టీడీపీ ఆత్మరక్షణ చర్యలు చేపట్టింది. పొత్తులతో సంబంధం లేకుండా ఇబ్బందులేమీ లేవని భావిస్తున్న కుప్పం, హిందూపురం, మంగళగిరి వంటి కొన్ని స్థానాలను గుర్తించి 25 మందితో తొలి జాబితాను ప్రకటించాలని చూస్తోంది. సంక్రాంతికి ఈ జాబితా విడుదలకు యతి్నస్తున్నా.. అది ఎంతవరకూ సాధ్యమనే అనుమానాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.
బాబు పక్కచూపులు
టీడీపీ నుంచి పోటీకి అభ్యర్థులు దొరక్కపోవడంతో అధికార పార్టీలోని అసంతృప్తుల వైపు చంద్రబాబు చూస్తున్నారు. అక్కడ చోటు లేక బయటకు వచ్చేవారిని చేర్చుకుని సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికార పార్టీలో సీటు దక్కని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఆయనకు పెనమలూరు లేదా నూజివీడు సీటు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలా చాలాచోట్ల వైఎస్సార్‌సీపీ సీటు నిరాకరించిన నేతలను చేర్చుకుని అభ్యర్థుల కొరత తీర్చుకోవాలని బాబు చూస్తున్నారు. దీన్నిబట్టి ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో స్పష్టమవుతోందనే వాదన రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment