సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలకు దిగారు. ఈడీ తనపై పెట్టింది మనీలాండరింగ్ కేసు కాదని.. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారామె. ఈ క్రమంలో తప్పు చేయని తాను కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానంటూ వ్యాఖ్యానించారు.
ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నేను తప్పుచేయలేదు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఇది మనీల్యాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ ల్యాండరింగ్ కేసు. తాత్కాలికంగా నన్ను జైల్లో పెడతారేమో.. నా ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బ తీయలేరు.
.. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారు. మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మూడో నిందితుడు బీజేపీకి రూ.50 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చాడు. ఇది తప్పుడు కేసు. క్లీన్‌గా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారేది లేదు. జై తెలంగాణ అంటూ కవిత నినాదాలు చేస్తూ కోర్టు హాల్‌లోనికి వెళ్లారు. మరోవైపు ఆమె మద్దతుదారులు, బీఆర్‌ఎస్ నేతలు కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment