
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 27 నెలల పాలనలో 14 నెలలు కోవిడ్‌కే పోయిందని, అయినా సీఎం జగన్ చెప్పిన ఏ మాటను వెనక్కి తీసుకోకుండా అమలు చేస్తున్నారని కొనియాడారు.
ఆదాయం లేకపోయినా అప్పు చేసైనా రైతులను ఆదుకోవాలని ఆయన భావించారని, అందుకు నిదర్శనమే రైతు భరోసా కింద రూ. 17,030 కోట్లు రైతులకు చెల్లించడం, పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అయితే చంద్రబాబు కొత్తగా రైతు ఆందోళనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన హయాంలో రైతులను విస్మరించి ఈ రోజు రైతు కోసం అంటూ రావడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.
రుణమాఫీ, 9 గంటల విద్యుత్ సరఫరా, 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని గతంలో రైతులకు మాయమాటలు చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు మళ్లీ రైతులు గుర్తుకు వచ్చారా అని ఎద్దేవా చేశారు. అసలు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి అధికారం పోయాక రైతు కోసం పోరాటం అనడం వింతగా ఉందని, దీన్ని ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.