వనమా వెంకటేశ్వరరావు.. 2018లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తప్పుడు సమాచారం ఇచ్చారని, కొన్నిచోట్ల ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారని జలగం వెంకట్రావు హైకోర్టులో 2019, జనవరిలో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపినన్యాయస్థానం.. వనమా ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రూ.5 లక్షల జరిమానా విధించింది. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఈసీని ఆదేశించింది.
బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. 2018లో గద్వాల్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో కృష్ణమోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రూ.2.5 లక్షల జరిమానా కూడా విధించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆదేశించింది
ఆ అభ్యర్థులిద్దరూ శాసనసభ్యులుగా విజయం సాధించిన వారే. ప్రజాఓటుతో గెలిచిన వారే. వారికి వచ్చిన ఓట్లను కోర్టు ఎక్కడా తప్పుబట్టలేదు. కానీ, అఫిడవిట్‌లో అన్ని అంశాలూ పేర్కొనలేదని, కొన్ని తప్పులుగా పేర్కొన్నారన్న కారణంగా వారిపై వేటు వేసింది. వారి తర్వాత రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులకు విజయం కట్టబెడుతూ కోర్టు తీర్పునిచ్చింది. ఇలా ఈ రెండు పిటిషన్లే కాదు.. దాదాపు 30 వరకు పిటిషన్లు హైకోర్టులో నమోదయ్యాయి. వనమా, బండ్ల, శ్రీనివాస్‌గౌడ్ కేసుల్లో విచారణ పూర్తయి తీర్పు వచ్చింది. ఇతర పిటిషన్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
♦ ఒకసారి కంటే ఎక్కువసార్లు పోటీ చేస్తున్న అభ్యర్థులైతే గతంలో వేసిన అఫిడవిట్‌తో ఈసారిఅఫిడవిట్‌ను సరిచూసుకోవాలి.
♦ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ కేసులున్నాయో.. లేదో..తెలుసుకోవాలి.
♦ సొంత ఆస్తులేకాదు.. కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఇది స్థిర, చర ఆస్తులకు కూడా వర్తిస్తుంది.
♦ కంపెనీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు తదితర వివరాలను పొందుపర్చాలి
♦ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, రుణాలు, వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం వివరాలను స్పష్టంగా పేర్కొనాలి
♦ మోటారు వాహనాలు, నగలు, బులియన్, ఇతర విలువైన వస్తువులు తూకంతో సహా వెల్లడించాలి
2018 ఎన్నికల తర్వాత 30కిపైగా పిటిషన్లు..
తప్పుడు అఫిడవిట్ల కారణంగా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇలా ఒకటి రెండేళ్లు కాదు.. ఏళ్ల కొద్దీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఏ మాత్రం తప్పని తేలినా వేటు పడక తప్పదు. తీర్పు వచ్చే వరకు మనశ్శాంతి ఉండదు. 2018 ఎన్నికలే కాదు... గతంలోనూ ఇలా కులం, ఆస్తుల విషయంలో కోర్టు చుట్టూ తిరిగిన వారున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైకోర్టులో 30కుపైగా పిటిషన్లు దాఖలు కాగా.. అందులో 25కుపైగా పిటిషన్లు ఒకే పార్టీకి చెందిన నేతలపై దాఖలయ్యాయి. పలువురు మంత్రులపై కూడా ఎన్నికల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
శ్రీనివాస్ గౌడ్‌పై తీర్పు రాగా.. కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఎన్నికపై వివాదం నడుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తర్వాత వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించి.. స్టే తెచ్చుకున్నారు. ఇక చెన్నమనేని రమేశ్, మర్రి జనార్దన్, ముత్తిరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరికొందరిపై హైకోర్టులో పిటిషన్లు నడుస్తున్నాయి.
అన్నీ సరిచూసుకుని వివరాలివ్వాలి
రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 3న వెలువడనుంది. అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే వివిధ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించనున్నారు. వారి స్థిర, చర ఆస్తులు, అప్పుల అఫిడవిట్లు అందజేస్తారు. ఈ అఫిడవిట్ల సమర్పించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ తెలిపింది. కేసులు, తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు.. ఇలా అన్ని అంశాలను సరి చూసుకుని అఫిడవిట్ అందజేయాలి. లేదంటే తర్వాత కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తోంది.
గత 2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారంటూ పదుల సంఖ్యలో కేసులు హైకోర్టులో దాఖలయ్యాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే దాఖలు చేసిన ఈ కేసులు ఇప్పటికి కొన్ని పూర్తవ్వగా, ఇంకా కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని అంశాలను పరిశీలించి అఫిడవిట్ వేయకుంటే శాసనసభ్యుడిగా గెలిచినా.. వేటు పడే అవకాశం ఉంది.
- గండ్రాతి అరవింద్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment