రాహుల్, రేవంత్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్య
అధికారం కోసం విద్యార్థులను వాడుకున్నదే కాంగ్రెస్
దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైరీలో రాస్తున్నాం
నిరుద్యోగులకు రాజకీయాలు అంటగడుతున్నారని విమర్శ
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చేందుకు విద్యార్థులను వాడుకున్న రాహుల్ గాందీ, రేవంత్‌రెడ్డిలలో ఎవరు సన్నాసో వారే చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లను డైరీలో నమో దు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యా రు. ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం పోలీసుల చేతిలో దెబ్బతిన్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వంతో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులపైనా పోలీసులు దుర్మార్గంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాబ్ క్యాలెండర్ అంటూ రాహుల్ గాంధీ బొమ్మ తో దినపత్రికలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు, యువతకు రేవంత్ రాజకీయాలు అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి తలలు, వీపులు పగలగొట్టడమే మీ మార్కు ప్రజాపాలనా అని కేటీఆర్ ప్రశ్నించారు.
కొత్త రూపంలో పాత అరాచకాలు
పాత అరాచకాల కాంగ్రెస్ మోసపూరితంగా కొత్త రూపంలో వచ్చిందని విమర్శించిన కేటీఆర్ ఈ విషయాన్ని ప్రజలు ఆరు నెలల్లోనే అర్థం చేసుకున్నారని చెప్పారు. హామీల అమలును ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడమేమిటని నిలదీశారు. గతంలో ప్రైవేటు యూనివర్సిటీలపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ ప్రస్తుతం ఏడు యూనివర్సిటీలకు కొత్తగా ఎలా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు.
గతంలో 50వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించి ప్రస్తుతం ఆరు వేల అదనపు ఉద్యోగాలతో యువతను మోసం చేస్తోందని ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 1.62 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు 40వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించామన్నారు. విద్యారంగంలో జరిగే అన్యాయాలపై బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆందోళన చేయాలని కేటీఆర్ సూచించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
హైదరాబాద్ దెబ్బతింటే దేశానికీ నష్టమే: ‘ఎక్స్’లో కేటీఆర్
పాలనానుభవం లేని నాయకత్వ ఫలితం రాజధాని హైదరాబాద్ మొదలుకొని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలోనూ కనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ మసకబారిందని, దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ప్రజల జీవితాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. సీఎం స్వయంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తున్నా శాంతిభద్రతలపై నియంత్రణ లేదని ఆరోపించారు.
నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని, పెట్టుబడులు తరలిపోతుండటంతో యువతకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని, విద్యుత్ కోతలు, నేరాలు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎంకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర రాజధానిపై లేదన్నారు. హైదరాబాద్ కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదని, తెలంగాణకు ఆర్థిక ఇంజిన్ అనీ, హైదరాబాద్ దెబ్బతింటే కేవలం తెలంగాణకే కాకుండా దేశానికి కూడా నష్టమేనని కేటీఆర్ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment