మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ఫొటో చూపిస్తున్న మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు
మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు
పార్టీలకు భూములు కేటాయింపుల జీవోలిచ్చింది చంద్రబాబు సర్కారే
ఆ ప్రకారమే దరఖాస్తు.. అన్ని అనుమతులతో మా కార్యాలయాల నిర్మాణం
మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి 33 ఏళ్లకు బదులు 99 ఏళ్లు లీజుకివ్వడం నిజం కాదా?
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు బదలాయించారన్న ఆరోపణల్లో నిజం లేదని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు ఆద్యుడు సీఎం చంద్రబాబేనని, ఆమేరకు జీవోలిచ్చింది ఆయన ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అదే విధానాన్ని తరువాత ప్రభుత్వం కొనసాగించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకోటలు కట్టుకున్నారని, వైఎస్ జగన్‌కు ప్యాలెస్‌ల పిచ్చి పట్టిందంటూ టీడీపీ విమర్శించడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాము కట్టినవి ప్యాలెస్‌లు అయితే టీడీపీ నిర్మించినవి ఏమిటని నిలదీశారు.
హైదరాబాద్‌లో కట్టిన ఎన్టీఆర్ ట్రస్టు భవనం ఏమైనా గుడిసెనా? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు చదువు నేర్పేందుకు వినియోగిస్తామంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని తర్వాత ఎన్టీఆర్ ట్రస్టుకు బదలాయించారన్నారు. ఆ ఆస్తి విలువ హైదరాబాద్ మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుతం రూ.1,000 కోట్లకుపైగా ఉంటుందన్నారు. మంగళగిరిలో హైవే పక్కన ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం భూమి విలువే రూ.75 కోట్లు ఉంటుందన్నారు. టీడీపీ తమ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించిన భూముల విలువ రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుందన్నారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే తమ పార్టీ కార్యాలయాలకు స్థలాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని అన్ని అనుమతులతో నిర్మాణాలు చేపట్టామని స్పష్టం చేశారు. ఎక్కడా అక్రమ నిర్మాణాలు చేయలేదన్నారు. మీ తాత జాగీరా? అంటూ మంత్రి లోకేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అధికార మదంతో వ్యవహరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ కార్యాలయాలను బుల్డోజర్లతో కూలి్చవేసే సంస్కృతిని ప్రజలు సహించరని హెచ్చరించారు. ఈ దుశ్చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
40 శాతం మంది ప్రజలు తమ పార్టీకి ఓట్లు వేశారన్న సంగతి మర్చిపోవద్దన్నారు. ఎక్కడ లోపాలు జరిగాయో సరిదిద్ది వైఎస్ జగన్ మళ్లీ బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిర్మించిన భారీ కార్యాలయాల ఫొటోలు, జీవోల కాపీలను ఈ సందర్భంగా సుధాకర్‌బాబు మీడియాకు విడుదల చేశారు.
⇒ మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి సర్వే నంబర్లు 392/1, 392/3, 392/4, 392/8, 392/9, 392/10లో జీవో నంబర్ 228 ద్వారా ఆత్మకూరు గ్రామంలో 2017 జూన్ 22న 3.65 ఎకరాలు కేటాయింపు. 33 ఏళ్లు మాత్రమే లీజుకు ఇవ్వాల్సిన భూములను 99 ఏళ్ల పాటు ఏటా రూ.1,000 చొప్పున లీజుకు ఇవ్వటం నిజం కాదా?
⇒ వైఎస్సార్ కడప జిల్లా నాగార్జునపల్లిలో సర్వే నంబర్ 295/1ఎ, 1బిలో జీవో నంబర్ 279 కింద 2015 జూలై 20న 33 ఏళ్లకు ఏటా రూ.వెయ్యి లీజు చొప్పున కేటాయింపు.
⇒ శ్రీకాకుళంలో సర్వే నంబర్ 700/1లో రెండు ఎకరాల భూమి 99 ఏళ్లకు ఏటా రూ.25 వేల చొప్పున లీజుకు కేటాయింపు.
⇒ విజయనగరంలో సర్వే నంబర్ 15/క, అయ్యన్న పేట గ్రామంలో జీవో 195 ద్వారా 2018 ఏప్రిల్ 23న 33 ఏళ్లకు రూ.1000 చొప్పున ఒక ఎకరం భూమి కేటాయింపు.
⇒ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నం గ్రామంలో జీవో నంబర్ 197 ద్వారా 2018 ఏప్రిల్ 23న 20 సెంట్ల భూమి 33 ఏళ్లకు రూ.1000 చొప్పున లీజుకు కేటాయింపు.
⇒ విజయవాడ అర్బన్ మండలం గుణదలలో జీవో నంబర్ 513 ద్వారా 2018 అక్టోబర్ 11న 95 సెంట్లు స్థలం 33 ఏళ్లకు రూ.1000 చొప్పున లీజుకు కేటాయింపు.
⇒ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెళ్లూరులో సర్వే నంబర్ 68/8లో జీవో నంబర్ 514 ద్వారా 2018 అక్టోబర్ 11న 33 ఏళ్లకు 1.96 ఎకరాల భూమి రూ.1000 చొప్పున లీజుకు కేటాయింపు.
⇒వైఎస్సార్ కడప జిల్లా అక్కాయపల్లి గ్రామంలో సర్వే నంబర్ 37/4లో జీవో 56 ద్వారా 2019 జనవరి 24న రెండు ఎకరాల భూమి 33 ఏళ్ల పాటు రూ.1000 చొప్పున లీజుకు కేటాయింపు.
⇒ చిత్తూరు జిల్లా గుండ్లాపల్లి గ్రామంలో సర్వే నంబర్ 1/1బీ3లో జీవో 59 ద్వారా 2019 జనవరి 24న 1.20 ఎకరాల భూమి 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.1000 చొప్పున లీజుకు కేటాయింపు.
⇒ శ్రీకాకుళం జిల్లా కొత్త అంబళ్లపల్లి మండలం కొత్తపేట గ్రామంలో సర్వే నంబర్ 106/3లో జీవో 63 ద్వారా 2019 జనవరి 24న 30 సెంట్ల భూమి 33 ఏళ్ల లీజుకు కేటాయింపు.
Comments
Please login to add a commentAdd a comment