జఫర్‌గఢ్: టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్) వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదె ఇన్నయ్య అరెస్టు కలకలం రేపింది. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరం గ్రామానికి చెందిన ‘మా ఇల్లు ప్రజాదరణ అనాథాశ్రమం’వ్యవస్థాపకుడు గాదె ఇన్నయ్యను బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, అనాథాశ్రమ పిల్లలు ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల నుంచి గాదె ఇన్నయ్య ‘భారత్ బచావో’కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన అరెస్టు కావడం అనుమానాలకు తావిస్తోంది. ఇన్నయ్యను అరెస్టు చేసింది రాష్ట్ర పోలీసులా? కేంద్ర దర్యాప్తు సంస్థలా అన్నది తెలియాల్సి ఉంది. ఇన్నయ్య విద్యార్థి దశలోనే రాడికల్ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో కలిసి హైదరాబాద్‌లోని జలదృశ్యం కార్యాలయంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.
అనంతరం టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. ఆ తరువాత కేసీఆర్‌తో ఏర్పడిన విభేదాలతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇన్నయ్య.. తెలంగాణ రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేసి ఉద్యమం కొనసాగించారు. ఈ క్రమంలో మళ్లీ జైలుకు వెళ్లారు. విడుదలైన అనంతరం జఫర్‌గఢ్ మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద 2006 మే 28న ‘మా ఇల్లు అనాథ అశ్రమం’నెలకొల్పారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘భారత్ బచావో’కార్యక్రమాన్ని చేపడుతున్న ఇన్నయ్యను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నివాసముంటున్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment