‘అబ్బయ్యా పీకే.. నేనెవురో తెలుసునా? నెల్లూరు పెద్దారెడ్డిని! అంటే ఎవురో తెలుసునా? ఆ మటుకు తెలీకుండా నువ్వు వూరూ వాడా ఎగిరెగిరి తిరగతా రాజకీయం ఎట్టాజేస్తండావబ్బా? నెల్లూరు టౌన్లోకొచ్చి ‘అయ్యా పెద్దారెడ్డి గారంటే ఎవరు?’ అని అడిగిసూడు.. పసి పిలకాయగూడా సిటికెలో నీ సెయ్యి బట్టుకోని బరబరా ఈడ్సుకోనొచ్చి నా కాడ నిలబెట్టకపోతే అప్పుడడుగు.. అబయా.. నువ్వేదో వొంటిసేత్తో మాయ జేస్తావని ఎలచ్చన్లలో ఎవురినైనా సరే యిట్టే గెలిపించేస్తావని నీకోసం ఎగబడతా వుంటారంట గదా.. నెల్లూరు కాడికొస్తే.. నీకు మించిన ఫాలోయింగు వుండాదబ్బయ్యా నాకు! పెద్దారెడ్డి యేందంటే.. అదే చెల్లతాది యీడంతా గూడా!
అద్సరే గానీ.. అబ్బయ్యా పీకే.. ఏందీ సెంద్రబాబు నిన్నేదో పిలిపించుకోని గుసగుసగా మాట్టాడినాడని జనమంతా చెప్పుకుంటావుండారే. ఏముండాదిలేగానీ.. ఈ ఎలచ్చన్లలో ఎట్టాగైనా సరే.. గెలిసేలా సూడు సామీ అని అడిగుంటాడు అంతే గదా! అవును గానీ అబ్బయ్యా.. నాకో అనుమానం.. ఇయ్యేందో వ్యూహాలూ గట్రా అంటారే.. ఆటిలో ఆయన్ని మించినోడు ఎవుడుండాడబ్బా? అప్పుడెప్పుడో.. మామ కొంప ముంచడానికి ఆ పచ్చ పార్టీలో అడుగుపెట్టడానికి ముందు ఆయన కాంగ్రేసులో ఉండగా ఏం జరిగిందో నీకు తెలుసునా అబ్బయ్యా?.
కాంగ్రెసు పార్టీ వోళ్లు పెట్టిన కేండేటునే ఓడించడానికి ఈ యెన్నుపోట్ల యీరాసామి.. అదేనబ్బా.. సెంద్రబాబుకు నేను పెట్టుకున్న ముద్దుపేరులే! ఆయన ఏం జేసినాడో తెలుసునా? సిత్తూరు జడ్పీ చైర్మనుకు ఓట్లెయ్యాల్సినోళ్లందరినీ పట్టకపొయ్యి క్యాంపు బెట్టినాడు. ఆళ్లెక్కడుండారో ఎవ్వుడికీ పోపిడి తెలియనియ్యలా? నడిమద్దెలో.. గుట్టుసప్పుడు కాకుండా కారేసుకోని కేరళకి పొయినాడు. ఓటెయ్యాల్సిన ఒక పెద్దమడిసి అక్కడేదో కేరళోల్ల వైద్యం చేయించుకుంటావుంటే.. ఆయన్ని దువ్వి.. ఇంకో కారులో సరిగ్గా ఓటేసే టయానికి ఆయన వొచ్చేలాగా ఎరేంజిమెంటు జేసినాడు. ఏదైతే ఏంది.. సొంత పార్టీ కాంగిరేసునే ఓడించి.. తన ముఠాని నెగ్గించుకున్నాడు.
సెంద్రబాబునాయుడు అంత ముదురు తెలివితేటలు సూపించేనాటికి నువు పుట్టినావో లేదోలే పీకే అబ్బయ్యా. రామారావుకు యెన్నుపోటు యెట్టా పొడిసినాడో ఆ కత యీ నడమ కాలం నాటిదే గదా.. నువ్వు యినేవుంటావులే! యీ దేసెంలో రాజకీయం జెయ్యాలనుకున్న పెతి ఒక్కడూ గూడా.. కుర్సీ ఎక్కాలంటే యెన్ని రకాల అడ్డతోవలుంటాయో తెలుసుకోటానికి జరూరుగా చదవాల్సిన పాటం లాంటిది గదబ్బయ్యా అదంతా! హోటల్లో పట్టుమని పదిమంది లేకపోయినా.. ఓయబ్బో ఎమ్మెల్యేలంతా సెంద్రబాబు గూట్లోనే ఉండారని ఊదరగొట్టేసి.. బయటుండేవోళ్లని బయంలోకి నెట్టేసి.. ఆడకి పరుగెత్తుకొచ్చేలాగా జేసేసి.. ఆపట్నే ఆడ్నించి కదల్నీకుండా కూసోబెట్టేసి.. సివరాకరికి ఎన్టీవోడు వొస్తే.. ఆయన మీద సెప్పులేయించి.. నానా రచ్చా జేసినాడు గదా..! అంతకంటె గొప్ప వ్యూహాలు నువు చెప్పబోతావా నాయినా పీకే అబ్బయ్యా!?.
ఆయనకి తెలీని డ్రామాలు, తెలీని కుట్రలు, కొత్త వ్యూహాలు నీబోటోడి వోడికి తెలుస్తాయా సామీ. మొన్నటికి మొన్న ఆయన ఇల్లాలిని యెవురో యేదో తప్పుడు కూత అన్నారే అనుకో.! అలిగినాడు.. ఓకే. అరిసినాడు.. డబలు ఓకే. అంతటితో ఊరుకున్నాడా? అన్నవాడెవడో ఒకమారు అంటే.. ఈ పెద్దమడిసి ఊరూరా తిరిగి వందల తూర్లు జనం ముందర అదే మాట అనుకుంటా తన యింటామె పరువు బజార్లో పెట్టేసిండ్లా? ఎందుకు నాయినా.. అద్ది నాయినా వ్యూహం అంటే.. జనం నించి సింపతీ, జాలి కొట్టేసే కిరికిరి అన్నమాట. అంతకంటె గొప్ప ప్లాన్లు జెప్పబోతావా పీకే అబ్బయ్యా!.
ఊరూరా తిరిగేది.. నేను ముసిలోణ్నయిపొయినానూ.. నాకు యీసారి సివరాకరి చాన్సు యియ్యండి.. మిగిలిందీ సగిలిందీ యేమైనా వుంటే అది గూడా దోసుకోని తొంగుంటానూ.. అని పాచిపాటే పాడతా ఉండేది..! చూసినావా పీకే నాయినా! యీన ముసిలోడు అయిపోతే యేందబ్బా..? ముసిలోళ్లకి సివరాకరి చాన్సు ఇయ్యాలని రాజ్యాంగంలో రాసుండాదా యెట్టా? ముసిలోళ్లకి జనం ఎగబడి ఓట్లెయ్యాల్నా యెట్టా? అట్టాగేం లేదు గదా! అయినాసరే, సింపతీకోసం ముసిలి డ్రామా అన్నమాట. ముసిలోడు అయిపోతే.. కిష్ణా రామా అనుకుంటా యింట్లో మనవడితో ఆడుకుంటా ఉండొచ్చు గదా? రాజకీయం కొడుకు చేతికియ్యొచ్చు గదా! నలబైనాలుగేళ్ల ఇండస్ట్రీ అంటాడే.. కొడుకుని చేతగాని దద్దమ్మగా తయారుజేసిన పెద్దమడిసి, తాను తప్పుకోని కొడుకు సేతిలో పార్టీని పెట్టాలంటే జడుసుకునే పెద్దమడిసి.. ఆయనేందబ్బా జనాన్ని ఉద్దరించబోయేది?
యిట్టాగ ఆయనకి తెలియని అయిడియాలు ఏముంటాయి సామీ. నువ్వు ఇప్పుడు ఈ ముసిలాయన సరసకొచ్చి ఏం జెయ్యబోతావు?. అయినా పీకే అబ్బయ్యా.. నిన్ను యెతుక్కుంటా వాకిటకు వచ్చిన బేరాన్ని కాలదన్నుకోటం ఎందుగ్గానీ.. సక్కంగా వాడుకో సామీ! రెండు మూడొందల కోట్లయినా నీ నట్టింట్లో కురవకపోతాయా? లచ్చిందేవి ఎవురికైనా చేదవతాదా? లేదు గదా? కాబట్టి కుమ్మేసుకో! యిక సెంద్రబాబుని సీఎం జేసే సంగతంటావా.. నీకెందుకు రంధి.. జగనన్న యింటి బిడ్డ మాదిరిగా జూసుకునే జెనం తేల్చుకుంటారులే! ఉంటా!!.
✍️:::పెద్దారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment